రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ టెర్రరిజం నడుస్తుందని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ వైఖరి వల్ల, కక్షా రాజకీయాల వల్ల అమర రాజా బ్యాటరీస్ యూనిట్ తెలంగాణకు తరలిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రానికి ఆ భారీ ప్రాజెక్టు వెళ్లడానికి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కారణం కాదా అని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 9500 కోట్ల రూపాయల విలువైన భారీ పెట్టుబడులను సొంత రాష్ట్రాన్ని కాదని పొరుగు రాష్ట్రంలో పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
అమర్ రాజా వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన, జగన్ ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక, పర్యావరణ అనుమతులు కాలుష్యం, తనిఖీలు అంటూ నిత్యం ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలోనే ఆ యూనిట్ తెలంగాణకు తరలిందని ఆరోపించారు. రాజకీయ కక్షతో రాష్ట్ర ప్రతిష్టను కూడా వైసిపి సర్కార్ పణంగా పెట్టిందని చంద్రబాబు మండిపడ్డారు. ఆసియాలోని బ్యాటరీ తయారీ అగ్రగామి సంస్థల్లో ఒకటైన అమర రాజా తెలంగాణకు తరలిపోవడం జగన్ అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు.
నాలుగు దశాబ్దాలుగా రాయలసీమలోని చిత్తూరులో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష కుటుంబాలకు ఆ సంస్థ ఉపాధి కల్పిస్తోందని, రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన అటువంటి సంస్థను తెలంగాణకు పారిపోయేలా చేశారని మండిపడ్డారు. కోర్టు తప్పు పట్టినా సరే చిత్తూరులోని సంస్థకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థి అన్న ఏకైక కారణంతోనే అమర రాజాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని దివిటిపల్లిలో దేశంలోనే అతిపెద్ద లిథియం బ్యాటరీల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆ కంపెనీ ఎండి, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో, పాటు భావితరం ఇంధనాల పరిశోధన కోసం అమర రాజా రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ను శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలో ఏర్పాటు చేస్తున్నారు.