తెలంగాణలో వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. షర్మిల పాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఆమె ఈ నెల 4 నుంచి పాదయాత్ర పున:ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో పది రోజుల్లో పాదయాత్ర ముగుస్తుందని, తనకు పోలీసులు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఈ క్రమంలోనే అసలు షర్మిల పాదయాత్ర చేసే అవసరమే లేదంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ సందర్భంగా జగన్ ను షర్మిలను పోలుస్తూ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏపీలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారని, కానీ, అక్కడ రాజన్న రాజ్యానికి బదులు నిరంకుశ పాలన సాగిస్తున్నారని పాల్ కామెంట్లు చేశారు. అన్న బాటలోనే షర్మిల కూడా పాదయాత్ర చేసి అలాంటి నిరంకుశ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అవసరమా అని నిలదీశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడానికి షర్మిల పాదయాత్ర చేయాల్సిన పనిలేదని అన్నారు.
తెలంగాణకు షర్మిల అవసరం లేదని, అధికారం కోసమే ఆ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. అసలు వైఎస్సార్ కు, తెలంగాణకు సంబంధం లేదని, షర్మిల వార్తలను మీడియా కవర్ చేయొద్దని పాల్ సూచించారు. ఇక, కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని, అందుకే, ఐటీ దాడుల్లో టీఆర్ఎస్ నేతల ఇళ్లలో కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తానని పాల్ ప్రకటించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే త్వరలో పాదయాత్ర చేస్తానని పాల్ అన్నారు.