తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితోపాటు మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించిన ఘటన దేశ రాజకీయాలను కుదిపేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో పోలీసుల దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టు గతంలో స్టే విధించడం, ఆ తర్వాత కేసు దర్యాప్తును మొయినాబాద్ పోలీసులు కొనసాగించవచ్చంటూ హైకోర్టు సంచలన తీర్పునివ్వడం తెలిసిందే.
అయితే, ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని బిజెపి దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు…ఈ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ మొదలుబెట్టిన సిట్..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సహా పలువురు ప్రముఖులకు నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిందితులలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు, ఒక్కొక్కరూ రూ.2 లక్షల పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించింది. దీంతోపాటు, ప్రతి సోమవారం కచ్చితంగా సిట్ విచారణకు హాజరు కావాలని, పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ముగ్గురూ తమ పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని, దేశం విడిచి వెళ్లకూడదని తీర్పులో పేర్కొంది.
అయితే, ఈ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైనప్పటికీ కేవలం సింహయాజీ మాత్రమే ఈ రోజు విడుదలకానున్నారు. రామచంద్ర భారతి, నందులపై బంజారాహిల్స్ పీఎస్ లో వేరే కేసులున్నాయి. ఈ కేసుల నేపథ్యంలో వారిద్దరూ రిమాండ్ లో ఉండడంతో ఆయా కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు వేసుకోవాల్సి ఉంటుంది.