వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు యథేచ్ఛగా భూకబ్జాలు, భూదందాలకు తెర తీశారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాంకు ఐటి శాఖ భారీ షాక్ ఇచ్చింది. జయరాం భార్య రేణుకమ్మకు ఐటి అధికారులు నోటీసులు జారీ చేశారు. బినామీ చట్టం కింద ఈ నోటీసులు జారీ కావడం సంచలనం రేపుతోంది. కర్నూలు జిల్లా ఆస్పరిలో దాదాపు 30 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలకు సంబంధించి రేణుకమ్మకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
దాదాపు 50 లక్షల విలువైన కొనుగోళ్లకు సంబంధించి లెక్కలు చూపలేదని ఆ నోటీసుల్లో ఐటీ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, ఒకే రోజున రేణుకమ్మతో పాటు ఆమె బంధువులు, సన్నిహితుల పేర్లతో దాదాపు 180 ఎకరాల భూమి రిజిస్టర్ అయిందని అధికారులు గుర్తించారు. అందులో 30 ఎకరాలు రేణుకమ్మ పేరు మీద రిజిస్టర్ అయిందని, మిగిలిన వారంతా బినామీలేనని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఈ మొత్తం 180 ఎకరాల భూమిని సీజ్ చేసినట్టుగా ఐటి అధికారులు వెల్లడించారు. అంతేకాదు, 90 రోజుల్లోగా ఈ భూమి కొనుగోళ్లకు సంబంధించి ఆదాయ వనరును తమకు చెప్పాలని ఆ నోటీసులలో ఐటి అధికారులు పేర్కొన్నారు.
అయితే, ఈ వివాదంలో జయరాం పేరు ప్రస్తావనకు రావడం ఇది తొలిసారి ఏమీ కాదు. ఇథినా ప్లాంటేషన్ సంస్థకు చెందిన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని జయరాంపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జయరాంపై ఆ సంస్థ డైరెక్టర్ మను బెంగళూరులో కేసు పెట్టారు. అంతేకాదు, ఆ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కూడా ఆయన కోరారు. అయితే, అందుకు ప్రతిగా మనోఫై రేణుకమ్మ , బంధువులు ఆస్పరి పీఎస్ లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా తాజాగా మంత్రి భార్యకు నోటీసులు ఇవ్వడం, అంత భారీ మేర భూమిని సీజ్ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.