ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల పేర్లు చాలాకాలంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో తాజాగా నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో సైతం కవిత పేరును ఈడీ ప్రస్తావించడం సంచలనం రేపుతోంది. దీంతో, కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీపైనా, బీజేపీపై కవిత విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో మోదీ ఎన్నో ప్రభుత్వాలు కూలగొట్టారని కవిత ఆరోపించారు. తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న 8 ప్రభుత్వాలను పడగొట్టి, అడ్డదారిలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనని ఆమె విమర్శించారు. ఎన్నికలకు ఏడాది ముందు మోడీ టార్గెట్ చేసిన రాష్ట్రంలో మోడీ కంటే ముందు ఈడీ వెళ్లడాన్ని ప్రజలు గమనించాలని కవిత చెప్పారు.
ప్రభుత్వాలను కూల్చే కుట్రలు మోడీ హయాంలో పరిపాటి అని, 2023 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ కంటే ముందు ఈడీ ఇక్కడకు వచ్చిందని కవిత ఎద్దేవా చేశారు. తన మీద, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఈడీ దాడులు సహజమని, వాటికి భయపడాల్సిన పని లేదని కవిత అన్నారు. ఈడీ, సీబీఐలనుపయోగించుకొని తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం కల అని అన్నారు.
తెలంగాణలో ప్రజలు, నాయకులు చైతన్యవంతులని, ఇక్కడ మిగతా రాష్ట్రాల మాదిరి అధికారం దక్కించుకోవడం, ప్రభుత్వం కూలగొట్టడం సాధ్యం కాదని అన్నారు. జైల్లో పెడతామంటే పెట్టుకో, భయపడే ప్రసక్తే లేదు అని కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, ఈడీ విచారణకు తాము సహకరిస్తామని , మీడియాకు ముందే లీకులిస్తూ అలజడి రేపాలనుకుంటున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు.