టిఆర్ఎస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గత మూడు రోజులుగా కనిపించడం లేదని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు మూడు రోజులుగా తన ఫోన్ కూడా రామ్మోహన్ స్విచ్చాఫ్ చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. రామ్మోహన్ ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక, సీబీఐ విచారణకు భయపడే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలంగాణ రాజకీయాలలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే అ పుకార్లకు తెరదించుతూ బొంతు రామ్మోహన్ మీడియా ముందుకు వచ్చారు. తాను ఎక్కడికి పోలేదని, కావాలనే తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రామ్మోహన్ వివరణనిచ్చారు. తాను కనబడకపోయేసరికి కొందరు మీడియా మిత్రులు కూడా ఊహాజనితంగా వార్తలు రాసినట్టుగా కనిపిస్తోందని అన్నారు. సీబీఐ విచారణ జరుపుతున్న నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని క్లారిటీ ఇచ్చారు.
కమ్యూనిటీకి సంబంధించిన ఓ ఫంక్షన్ లో శ్రీనివాస్ కొందరు నాయకులను కలిశారని, ఆ విషయాన్ని గంగుల కమలాకర్ కూడా చెప్పారని, ఆ శ్రీనివాస్ తో అంతకుమించి తమకు పరిచయం లేదని అన్నారు. శ్రీనివాస్ తప్పు చేస్తే దాంతో తమకేం సంబంధం ఉంటుందని రామ్మోహన్ అన్నారు. ఈ ప్రచారం వెనక రాజకీయ కుట్ర ఉందని అన్నారు. తన దగ్గర్నుంచి 20 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అనే ప్రశ్నను రామ్మోహన్ ఖండించారు. తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఒకవేళ తనకు నోటీసులు వస్తే తనను నిరూపించుకుంటానని రామ్మోహన్ అన్నారు.