టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు పెళ్లి చేసుకోవటం.. వారికో సంతానం కలగటం.. ఇదంతా గతం. ఇప్పుడంతా మారిపోయింది. వారిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని.. వారిద్దరూ దూరంగా ఉంటున్నారని.. విడాకుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు సానియా కానీ అటు షోయబ్ కానీ మాట్లాడటం లేదు. ఆ మాటకు వస్తే ఆ విషయాన్ని అస్సలు ప్రస్తావించటం లేదు కూడా. మరోవైపు ఈ సెలబ్రిటీ జంట విడిపోవటానికి సిద్ధమైందని పలువురు స్పష్టం చేస్తున్నా.. వారిద్దరు మాత్రం మాట్లాడటం లేదు.
ఇక.. ఇద్దరి సోషల్ మీడియా ఖాతాలు సైతం సందేహాలు కలిగిస్తూనే.. మరోవైపు కలిసి ఉన్నారేమో? అన్న భావన కలిగేలా చేస్తోంది. సానియా మీర్జా సోషల్ ఖాతాల్నే తీసుకుంటే.. విడాకులకు సానుకూలంగా ఉన్నట్లుగా ఆమెకు సంబంధించిన కొన్ని పోస్టులు ఉంటే.. మరికొన్ని మాత్రం విడిపోవటానికి ఏమాత్రం సిద్ధంగా లేదన్నట్లుగా ఉండటం కనిపిస్తుంది. మరోవైపు షోయబ్ మాలిక్ ఎపిసోడ్ ను తీసుకుంటే.. అతగాడికి పాక్ నటి అయేషా ఒమర్ తో సన్నిహితంగా ఉండటం.. ఈ విషయంలో హర్ట్ అయిన సానియా.. భర్తకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అయేషా మత్తులో ఉన్న షోయబ్.. సానియాను పట్టించుకోకపోవటంతో భర్త నుంచి విడిపోయే విషయంలో సానియా స్పష్టతకు వచ్చినట్లుగా చెబుతున్నారు. తనను మోసం చేసిన భర్తను క్షమించే అవకాశమే లేదంటున్నారు.
మరి.. విడిగా ఉండి.. విడాకుల దిశగా అడుగులు పడిపోయిన నేపథ్యంలో.. ఆ విషయాన్ని వెల్లడించటానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు స్పోర్ట్స్ కఫుల్ కలిసి ఒక షో చేస్తుండటం.. అందులో ఒప్పుకన్న ఒప్పందం ప్రకారం.. ఈ ఇద్దరు తమకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదని.. ఈ కారణంతోనే వారిద్దరు మౌనంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. 2010లో వీరిద్దరి వివాహం జరగ్గా.. ప్రస్తుతం ఈ ఇధ్దరు విడిగా ఉండే వరకు వెళ్లింది. హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంపై ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.