వైయస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను చెన్నారావుపేట వద్ద పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత ఆమెను లోటస్ పాండ్ లోని నివాసంలో వదిలిపెట్టడం తెలిసిందే. అయితే, ఆ తర్వాత పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి షర్మిల బయటకు రావడం, అద్దాలు పగిలిన కారును షర్మిల స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్ వైపు వెళ్లడం కలకలం రేపింది. దీంతో, పోలీసులు ఆమెను పంజాగుట్ట జంక్షన్ వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అయితే, ట్రాఫిక్ పోలీసులు వారించినా ఆమె వినకపోవడంతో కారులో షర్మిల ఉండగానే క్రేన్ సాయంతో ఆ కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. అయితే, స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా కారు నుండి షర్మిల బయటకు రాకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. షర్మిల కారు దిగిపోవడంతో పోలీసులు బలవంతంగా ఆమెను కారులో నుంచి దించి స్టేషన్ లోకి తరలించారు. దీంతో, షర్మిలను చూసేందుకు బ్రదర్ అనిల్ కుమార్ స్టేషన్ కు రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది
ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న ఆరోపణలతో షర్మిలపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల తమతో దురుసుగా ప్రవర్తించారని, అసభ్యకరంగా దూషించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆ వ్యవహారాన్ని షూట్ చేస్తున్న పోలీసు అధికారి ఫోన్ కూడా లాక్కున్నారని ఆరోపించారు. అందుకే, షర్మిలను రిమాండ్ కు పంపకుంటే శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల వాదనలను విన్న నాంపల్లి కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఏడుగురికి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు అయింది.