పాపం కొరటాల.. అయ్యో కొరటాల…గత ఆరు నెలల్లో చాలామంది చాలాసార్లు ఈ మాటలు అనుకున్నారు. ఇప్పుడు మరోసారి కొరటాలను చూసి అందరూ జాలి పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎలాంటి దర్శకుడికైనా కెరీర్లో ఫ్లాపులు, డిజాస్టర్లు అన్నవి సహజం. రాజమౌళి లాంటి అరుదైన దర్శకులను పక్కన పెడితే.. మహా మహులైన డైరెక్టర్లు దారుణమైన డిజాస్టర్లు ఇచ్చిన వాళ్లే. కానీ వాళ్లెవ్వరికీ ఎదురు కాని ఇబ్బందికర పరిస్థితిని కొరటాల ఎదుర్కొన్నాడు. ఆచార్య సినిమా సరిగా తీయకపోవడం ఒక పాపం అయితే.. ఆ సినిమా బిజినెస్‌ను డీల్ చేయడం అంతకుమించిన శాపంగా మారింది కొరటాలకు.
రెండేళ్లకు పైగా కష్టపడి సినిమా తీసినందుకు రూపాయి మిగలకపోగా.. చేతి నుంచి డబ్బులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. జరిగిందేదో జరిగిందిలే అని తర్వాతి సినిమా మీద ఫోకస్ పెడదామంటే తరచుగా ఆయనకు ఆచార్య టీం నుంచే బౌన్సర్లు వచ్చి తగులుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ ఈ ఫెయిల్యూర్ గురించి మాట్లాడిన మాటలు కొరటాలకు ఇబ్బందికరంగా మారాయి. అందరూ కొరటాలదే తప్పన్నట్లు, ఆయన్నే నిందిస్తున్నట్లు మాట్లాడారు. ఇక క్రిటిక్స్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడేమో సంగీత దర్శకుడు మణిశర్మ కూడా ఈ జాబితాలోకి చేరాడు. ఆలీతో జాలీగా ప్రోగ్రాంలో మాట్లాడుతూ.. ఆచార్య సినిమా కోసం తాను ఇచ్చిన బీజీఎం ఒకటైతే.. కొరటాల చేయించుకున్నది ఇంకొకటని.. అందుకే ఈ సినిమా అలా తయారైందన్నట్లు మాట్లాడాడు.
ఐతే పూర్తిగా తప్పు కొరటాలదే అని ఆయన మీదికి తోసేయడం ఎంత వరకు కరెక్ట్ అన్నది ప్రశ్న. ఇప్పటికే కొరటాల మీద పరోక్షంగా జరిగిన దాడితో ఆయనకు చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు మణిశర్మ సైతం నో కామెంట్ అని చెప్పాల్సిన చోట.. కొరటాల మీదికి నిందను తోసేయడం అన్యాయంగా అనిపిస్తోంది. ఇండస్ట్రీలో అసలు ఆచార్య లాంటి డిజాస్టరే లేనట్లు, ఈ సినిమా తీయడానికి మించిన పాపం లేనట్లు అందరూ కొరటాలను నిందించడం విచారకరం.