జగన్ హయాంలో ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్లు…వాటితో జనం జేబుకు పడుతున్న బ్యాండ్లు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఏపీలో జగన్ తన సొంత బ్రాండ్లు పెట్టి చీప్ గా లిక్కర్ అమ్ముతున్నారని విమర్శలు వస్తున్నాయి. మద్యం రేట్లు ఆకాశాన్నంటుతున్నా…బ్రాండ్లు మాత్రం నాసిరకం ఉండడంపై దుమారం రేగుతోంది. మద్యపాన నిషేధం అంటూ జగన్…తన, తన పార్టీ నేతలకు చెందిన సొంత కంపెనీల మద్యాన్ని అమ్ముకుంటున్నారని విపక్షాలు చీప్ లిక్కరెత్తిపోస్తున్నాయి.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఫిర్యాదుతో కేంద్రం నుంచి వచ్చిన టీమ్…జగన్ అమ్మే నకిలీ బ్రాండ్లను గుర్తించి గతంలో వార్నింగ్ ఇచ్చింది. దీంతో, బ్రాండ్ మార్చకపోతే బ్యాండ్ పడుతుందని గ్రహించిన జగన్ మద్యంపై ‘నకిలీ’లలు కొంతకాలం ఆపాల్సి వచ్చింది. అియతే, ఆ వార్నింగ్ ఎఫెక్ట్ తగ్గడంతో తాజాగా మరోసారి నకిలీ బ్రాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. అంతేకాదు, కర్నూలు జిల్లాలో అయితే, ప్రత్యేకించి ఓ 5 మద్యం బ్రాండ్లను విచ్చలవిడిగా అమ్మాలంటూ పెద్దల నుంచి ఆదేశాలు వస్తున్న వైనం ఇపుడు చర్చనీయాంశమైంది.
వైసీపీ నేతల కంపెనీలకు చెందిన ఆ 5 బ్రాండ్ల విక్రయాలు భారీగా పెంచాలని ఆబ్కారీ శాఖలోని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, మందుబాబులు ఆ 5 బ్రాండ్లు కొనేందుకు విముఖత చూపడంతో ఏం చేయాలో అర్థం కాక ఆబ్కారీ శాఖలోని కింది స్థాయి అధికారులతో పాటు వైన్ షాపుల్లోని సేల్స్ మెన్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. దీంతో, కొంతమంది మద్యం దుకాణాలకు, బార్ల నిర్వహకులకు బలవంతంగా ఆ బ్రాండ్లను కట్టబెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆ బ్రాండ్ల అమ్మకాలు పెంచడం కోసమే గ్రామాల్లో ఎస్ఈబీ అధికారులు రైడ్ లు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.