వైసీపీ కీలక నాయకుడు, ప్రస్తుత వ్యవసాయమంత్రి కాకాణి గోవర్థన్‌కు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. నెల్లూ రు న్యాయస్థానంలో చోరీ ఘటనపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
సాక్ష్యాల చోరీపై నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి విచారణ జరిపి ఇచ్చిన నివేదికను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరిపింది. ఈ కేసులో వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి నిందితులుగా ఉన్నారు.
నెల్లూరు కోర్టులో చోరీ జరిగిన కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని నెల్లూరు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో కోరారు. దీన్ని సుమోటోగా స్వీకరించి గతంలోనే విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా సీబీఐ విచారణకు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వడంతో అప్పుడు తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. తాజాగా వెల్లడించింది.
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి విదేశాల్లో వేల కోట్లు ఆస్తులున్నా యంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి గతంలో ఆరోపించారు. దీనికి ఆధారాలు సైతం ఉన్నాయంటూ కొన్ని పత్రా లు విడుదల చేశారు. అవి నకిలీ పత్రాలంటూ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కాకాణిపై కేసు నమోదైంది.
ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు నెల్లూరు నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి ఈ ఏడాది ప్రారంభంలో చోరీకి గురయ్యాయి. దీనిపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు.
ఈ కేసులో దర్యాప్తు సరిగా సాగలేదని.. పోలీసులు కనీసం వేలిముద్రలు, పాదముద్రికలు సేకరించలేదని, డాగ్‌స్క్వాడ్‌ను కూడా పిలవలేదని నివేదికలో పొందుపరిచారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పరిణామం.. మంత్రి కాకాణికి సంకటస్థితిని కల్పించడం ఖాయమని అంటున్నారు న్యాయ నిపుణులు.
సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించిన తర్వాత @kakanigovardhan కి కొంచెమైనా నైతిక విలువలు, మానవత్వమున్నా మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కానీ దేనికైనా దిగజారే మనస్థత్వం కలిగిన కాకాణి పదవి వదులుకుంటారని నేను అనుకోవడం లేదు@ysjagan pic.twitter.com/4GJH2lz7bx
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) November 24, 2022