సీఎం జగన్ పాలనలో టిడిపి నేతలు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ జెసి అస్మిత్ రెడ్డిపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. తాడిపత్రి మున్సిపాలిటీలో పర్యటిస్తున్న అస్మిత్ రెడ్డిపై వైసీపీ కౌన్సిలర్ బాషా బీడీ ఫ్యాక్టరీ వద్ద రాళ్ల దాడి జరిగింది. విద్యుత్ సరఫరా ఆపేసి మరీ చీకట్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాళ్లు తీసుకొని దాడికి పాల్పడిన వైనం కలకలం రేపుతోంది.
అయితే, వైసిపి కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి కార్యకర్తలు కూడా ప్రతిదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ దాడి నుంచి అస్మిత్ రెడ్డిని తప్పించిన కార్యకర్తలు ఆయనను ఓ ఇంట్లో సురక్షితంగా ఉంచారు. ఈ క్రమంలోనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.
ఈ క్రమంలోనే అస్మిత్ రెడ్డిపై దాడిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. టిడిపికి ప్రజాదరణ పెరుగుతోందని, అది చూసి ఓర్వలేకే వైసీపీ ముష్కరమూకలు ఈ దాడులకు పాల్పడుతున్నాయని లోకేష్ ఆరోపించారు. చీకట్లో దాడి చేసి పిరికిపందల్లా పోలీసుల వెనుక దాక్కున్నారని, దమ్ముంటే ఎదురుగా వచ్చి ఢీకొనాలని లోకేష్ సవాల్ విసిరారు. తాడిపత్రిలో విసిరిన రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ ను తాకుతాయని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.