ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిల మధ్య కొద్దిరోజుల క్రితం చిరు వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ వివాదం సద్దుమణుగుతుందనుకుంటున్న తరుణంలో తాజాగా గరికిపాటి మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళలను అవమానపరిచేలా గరికపాటి ప్రసంగాలు ఉంటున్నాయంటూ విశాఖపట్నంలో పలు మహిళా సంఘాలు ఆందోళనకు దిగడం సంచలనం రేపుతోంది.
మహిళా సాధికారతను ఆధ్యాత్మికత ముసుగులో అణిచివేయాలని గరికపాటి చూస్తున్నారని, ఆయనపై ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గరికపాటికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని వారంతా రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో గరికపాటికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. గరికపాటిపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.
తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యు, సిఎం ఎస్, పీఓడబ్ల్యూ వంటి పలు మహిళా సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి గరికపాటిపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మనువాదాన్ని స్థిరీకరిస్తూ మహిళలపై హింసను ప్రేరేపిస్తున్న ఆధునిక మనువు గరికపాటిపై ప్రభుత్వం, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గరికపాటి తన ప్రసంగాల్లో స్త్రీలపై పలు వ్యాఖ్యలు చేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. స్త్రీలు ఉండే విధానం వారి తీరు గురించి ముక్కుసూటిగా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను గరికపాటి వెల్లడిస్తుంటారు. మహిళలతో పాటు భర్తలు భార్యల విషయంలో ఎలా ఉండాలి ఇత్యాది విషయాలపై కూడా గరికపాటి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతుంటారు.