కర్నూలు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్ర బాబు ఇక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఇక్కడి రైతుల కష్టాలు తీరుస్తామని, అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగేషన్ ఎంతో ముఖ్యమని చెప్పారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్, సిద్ధాపురం లిఫ్టు ఇరిగేషన్‌ను తానే పూర్తిచేశానన్నారు. రాయలసీమ లిఫ్టు అన్నారని, అది ఏమైందని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
అన్ని ప్రాజెక్టులు టీడీపీనే తీసుకొచ్చిందని తెలిపారు. “హంద్రీ నీవాకు రూ.5,500 కోట్లు, గాలేరు-నగరి ప్రాజెక్టుకు రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టాను. అమరావతిని ఎందుకు నాశనం చేశారో తెలుసా.. విశాఖపట్నంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా కబ్జా చేయవచ్చు. అక్కడ భూ అక్రమాలన్నీ ఏ-2 విజయసాయిరెడ్డి కనుసన్నల్లో జరుగుతున్నాయి. విశాఖపట్టణంలో మెడ మీద కత్తి పెట్టి భూములు రాయించుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని నిర్మించి ఫ్రీ జోన్ చేస్తాం“ అని కర్నూలు జిల్లా విద్యార్థులకు హామీ ఇచ్చారు చంద్రబాబు.
హైదరాబాదుకు సమాంతరంగా కర్నూలు అభివృద్ధి చేయాలనే విజన్‌లో ముందుకు వెళ్లినట్టు చంద్రబాబు అన్నారు. 33 వేల ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హజ్ అభివృద్ధి చేశానని చెప్పారు. భూమి ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్న చంద్రబాబు.. తమ హయాంలోనే స్టీల్ ప్లాంటు కూడా తెచ్చిన విషయాన్ని గుర్తు చేవారు. సీడ్ హబ్, సోలార్ పవర్ యూనిట్లు తెచ్చామని తెలిపారు. శ్రీశైలంలో రివర్స్ పంపింగ్ సిస్టమ్ తేవాలని అనుకున్నామని, అవన్నీ చేసి ఉంటే ఈ రోజు కర్నూలు జిల్లా యువతకు ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఉంటే పరిశ్రమలతో కర్నూలు జిల్లా కళకళలాడేదన్నారు. “మీకు ఉద్యోగాలు రావనే సమస్యే ఉండేది కాదు. యువతకు బంగారు భవిష్యత్తు ఉండేది. జగన్ వచ్చి సర్వనాశనం చేశాడు. కడప యోగి వేమన యూనివర్సిటీలో వైఎస్ఆర్ పెట్టిన వేమన విగ్రహాన్ని తీసేశారు. రాయలసీమ విశ్వవిద్యాలయంలో 250 మందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారు. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది.“ అని యువతకు చంద్రబాబు హామీలు గుప్పించారు.