టిడిపి నేత, మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నారాయణను ఆయన నివాసంలోనే ప్రశ్నించాలంటూ ఏపీ సిఐడి అధికారులకు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అమెరికా నుంచి చికిత్స తీసుకుని తిరిగి వచ్చిన నారాయణకు ఏపి సిఐడి అధికారులు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేయడం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారాయణకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
అయితే, అధికారులు తనకిచ్చిన నోటీసులను ఏపీ హైకోర్టులో నారాయణ సవాల్ చేశారు. తన క్లైంట్ నారాయణ అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకున్నారని, ఆయనకు విశ్రాంతి కావాలని నారాయణ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు…హైదరాబాద్ లోని నారాయణ నివాసంలోనే ఆయనను ప్రశ్నించాలంటూ సిఐడి అధికారులను ఆదేశించింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో మార్పులు,చేర్పులు చేశారని, ఈ క్రమంలోనే ఆనాడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణపై వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదు ప్రకారం నారాయణపై ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు, టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో నారాయణకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను చిత్తూరు జిల్లా కోర్టు రద్దు చేసింది. నవంబర్ 30 లోపు పోలీసుల ఎదుట నారాయణ లొంగిపోవాలని చిత్తూరు జిల్లా 9వ అడిషనల్ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును కూడా నారాయణ హైకోర్టులో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.