సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర పద్మాలయ స్టూడియోస్ నుంచి పంజాగుట్టలోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. కృష్ణ పార్థివ దేహం ఉన్న వాహనం వెంబడి వేలాదిమంది అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. తమ అభిమాన హీరోని కడసారి చూసుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కృష్ణ పార్థివ దేహం ఉన్న వాహనం వెనుక మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. అంతిమయాత్ర కొనసాగుతున్న రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. అశ్రునయనాల మధ్య అశేష జనవాహిని రోడ్డుకు ఇరువైపులా నిలబడి టాలీవుడ్ దిగ్గజ నటుడికి తుది వీడ్కోలు పలికారు. జోహార్ కృష్ణ…కృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మహా ప్రస్థానంలో కృష్ణ పార్థివదేహానికి పోలీసులు గౌరవ వందనం చేశారు.
మహాప్రస్థానంలోకి పోలీసులు అందరినీ అనుమతించలేదు. సన్నిహితులను, కుటుంబ సభ్యులను మాత్రమే లోపలికి పంపి ఇతరులను బయట ఆపేశారు. మహాప్రస్థానానికి కృష్ణ పార్థివ దేహం చేరుకున్న తర్వాత కృష్ణ పాడెను ఆయన చిన్ననాటి మిత్రుడు, సినీ నటుడు మురళీమోహన్, టిడిపి నేత బుద్ధ వెంకన్న మోశారు. కృష్ణ పార్థివ దేహానికి ఆయన తనయుడు మహేష్ బాబు శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు.
అంతకుముందు, కృష్ణ పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోకు వచ్చి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం జగన్, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, నారా బ్రాహ్మణి, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, సీనియర్ నటి జయప్రదతోపాటు పలువురు ప్రముఖులు కృష్ణ పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమ అభిమాన నటుడిని చివరి చూపు చూసి వీడ్కోలు పలికేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
https://www.youtube.com/watch?v=vkTHgLoIYl0