అటు ప్రధాని మోడీ, ఇటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ని నెటిజన్లు ఒకేసారి ఆడేసుకున్నారు. గత ఏడాదిన్నర కిందట పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగిన సమయంలో ప్రదాని మోడీ తన గడ్డం పెంచేశారు. అప్పట్లో ఆయన ఎందుకలా పెంచుతున్నారనే చర్చ జోరుగా సాగింది.
దీనిపై అప్పట్లో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేశారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్‌ను మోడీ అనుకరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. మరికొందరు `మోడీ బాబా సరికొత్త రూపం` అని కామెంట్లు కుమ్మరించారు. ఇక, ఇప్పుడు తాజాగా భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ పైనా ఇదే తరహా వ్యాఖ్యలు వస్తున్నాయి.
నిజానికి రాహుల్ గాంధీ గడ్డంతో కనిపించడం ఇదే తొలిసారి కాదు. 2012లో గడ్డంతో కనిపించి మీడియా దృష్టిని ఆకర్షించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన గడ్డంతో కనిపించారు. స్థానికులతో కలిసిపోయిందుకు ఆయన రఫ్ లుక్‌లో కనిపించేవారని ఆయన సన్నిహితులు చెప్పేవారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవమే ఎదురైంది. దీంతో ఆ తర్వాత ఆయన గడ్డాన్ని తొలగించి క్లీన్ షేవ్‌తో కనిపించేవారు. కొందరు మహిళా నేతలైతే భారత్ జోడో యాత్ర ముగిసే వరకు రాహుల్ గడ్డం తీయొద్దని విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం.
రాహుల్ గాంధీ గడ్డం ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియాలోనూ చర్చనీయాంశమైంది. రాహుల్ గడ్డం పై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తుంటే.. అసలు రాజకీయాల్లో గడ్డం నాయకులెం తమంది ఉన్నారన్న చర్చను జాతీయ మీడియా అందుకుంది. నిజానికి రాహుల్ మొదట్లో గడ్డంతోనే కనిపించేవారు. ఆ తర్వాత ఫెయిర్ లుక్కు మారారు.
ఇప్పుడు మళ్లీ ఆయన గడ్డంతో కనిపించడం చర్చనీయాంశమైంది. ఇది సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కూడా దారితీసింది. సామాజిక మాధ్యమాల్లోని కొన్ని వర్గాలు గడ్డంతో ఉన్న రాహుల్ ఫొటో పక్కన సద్దాం హుస్సేన్ ఫొటోను జోడించి కొందరు గడ్డం పెంచితే ఇలా కనిపిస్తారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరేమో మూవీ స్టార్లా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/RameshSanapala5/status/1592121672202858497
గడ్డం రాహుల్‌ను చూసిన కొందరు 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ సినిమాలోని టామ్ హాంక్స్ లా ఉన్నారని చెబుతున్నారు. మరికొందరేమో జర్మన్ తత్వవేత్త కార్ల్ మార్క్స్లా ఉన్నారని అంటున్నారు. నిజానికి గడ్డం, మీసాన్ని పురుషత్వానికి ప్రతీకగా భారతీయులు భావిస్తారు. మన పురుష ప్రధానుల్లో నలుగురు మాత్రమే గడ్డంతో కనిపించేవారు. చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్ ఏడాది పాటే ప్రధానులుగా ఉన్నా వారు నిత్యం గడ్డంతోనే కనిపించేవారు. ఇప్పుడు మోడీ కూడా గడ్డంతోనే దర్శనమిస్తున్నారు.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ ట్రిమ్ చేసుకున్న గడ్డంతోనే కనిపిస్తారు. అయితే, గతేడాది జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో మాత్రం పూర్తి గడ్డాన్ని పెంచుకుని మునిలా కనిపించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్‌ను గుర్తు చేస్తూ ఓట్లు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయనలా గడ్డం పెంచుకున్నారని ప్రతిపక్షాలు విమర్శించా యి. రాహుల్ గాంధీ కూడా అప్పట్లో మోడీ గడ్డంపై విమర్శలు గుప్పించారు. దీంతో ఇప్పుడు ఆయనే గడ్డం పెంచడంతో బీజేపీ కూడా విమర్శలకు పనిచెబుతోంది.