టాలీవుడ్ సూపర్ స్టార్, దిగ్గజ నటుడు కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రికి వచ్చిన సమయానికే కృష్ణకు గుండెపోటు వచ్చిందని వారు వెల్లడించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనకు సిపిఆర్ చేసి కార్డియాక్ అరెస్టు వల్ల ప్రాణహాని ముప్పు నుంచి తప్పించామని వారు చెప్పారు. అయితే, కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి మరో 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు అన్నారు.
8 మంది వైద్య నిపుణుల బృందం కృష్ణకు ప్రపంచ స్థాయి చికిత్స అందిస్తోందని వైద్యులు వెల్లడించారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల కృష్ణ శరీరంలోని మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు దెబ్బతిందని వారు చెప్పారు. ప్రస్తుతానికి కృష్ణకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ఆయన శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు.
రేపటికి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నామని అన్నారు. కృష్ణ గారు రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా ధైర్యశాలి, సాహసవంతుడు అని నరేష్ అన్నారు. కృష్ణ పోరాట యోధుడని, ఈ పరిస్థితి నుంచి క్షేమంగా బయటపడతారన్న నమ్మకం ఉందన్నారు. అంతేకాదు, కృష్ణ గారి ఆరోగ్యం కోసం అభిమానులంతా దేవుడిని ప్రార్థించాలని నరేష్ కోరారు.