సీఎం జగన్ పాలనలో వైసీపీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సామాన్య ప్రజలు మొదలు సెలబ్రిటీల వరకు…భూమి ఎవరిదైనా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కన్ను పడిందంటే చాలు కబ్జా కావాల్సిందేనని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు వైసీపీ నేతలు బోర్డు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ, అటవీ, బంజరు, చెరువు, ఈనాం….భూమి ఏదైనా సరే కబ్జా మాత్రం కామన్.
ఎకరాల కొద్దీ పొలాలు, వందల సెంట్ల కమర్షియల్ ప్లాట్లు స్వాధీనం చేసుకుని భూ బకాసురులుగా మారుతున్నారు. ఇదేం అన్యాయం అని ఎవరైనా ఎదురు తిగిగితే…ఇచ్చిన పదో పరకో తీసుకొని స్థలం రాసిచ్చి ఖాళీచేయాలంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. మాట వినని వారిపై రౌడీమూకలు, పోలీసులను రంగంలోకి దింపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ రెండూ కుదరకపోతే రెెవెన్యూ శాఖలో లొసుగులు, అధికారం ఉపయోగించి కొత్త రికార్డులను సృష్టించి అసలు స్థలం ఓనర్లను కోర్టులపాలు చేస్తున్నారు.
విశాఖ ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు స్థలాన్ని సైతం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ కబ్జా చేశారిన ఆరోపణలు వచ్చిన వైనం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై కూడా భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు జనసేన నేత నానాజీ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెందిన 30 ఎకరాల భూమిని తోట త్రిమూర్తులు ఆక్రమించుకున్నారని, అందులో చేపల చెరువులను ఏర్పాటు చేశారని నానాజీ ఆధ్వర్యంలో జనసేన నేతలు కలెక్టర్ హిమాన్షుకు ఫిర్యాదు చేశారు.
గతంలో, ఈ భూములను ప్రభుత్వం సీలింగ్ భూములుగా గుర్తించిందని, వాటిని త్రిమూర్తులు ఆక్రమించుకున్నారని నానాజీ ఆరోపించారు. అంతేకాదు, ఆ భూమిని త్రిమూర్తులు తన కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్టర్ చేయించుకున్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి 5 కోట్ల రూపాయల రుణం కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి త్రిమూర్తులు దురాక్రమణ నుంచి ప్రభుత్వ భూమిని విడిపించాలని కలెక్టర్ ను కోరారు.