టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. షూటింగ్ జరుగుతుండగానే హఠాత్తుగా నాగశౌర్య కుప్పకూలిపోయాడు. దీంతో, ఆ చిత్ర యూనిట్ సభ్యులంతా షాక్ అయ్యారు. వెంటనే నాగశౌర్యను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే, నాగశౌర్యకు పెద్దగా ప్రమాదమేమీ లేదని, డీహెడ్రేషన్ వల్లే నాగశౌర్య కుప్పకూలాడని వైద్యులు వెల్లడించారు. 105 డిగ్రీల జ్వరంతో కూడా షూటింగ్లో పాల్గొనడం వల్లే నాగశౌర్య డీహైడ్రేషన్ కు గురై కళ్ళు తిరిగి పడిపోయాడని వైద్యులు చెబుతున్నారు.
గతంలో ఓసారి షూటింగ్ సందర్భంగా నాగశౌర్య తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అశ్వద్ధామ చిత్రీకరణలో భాగంగా యాక్షన్ సీన్స్ షూట్ చేస్తూ నాగశౌర్య గాయపడ్డాడు. ఆ క్రమంలో నాగశౌర్య మోకాలికి తీవ్ర గాయం కావడంతో నెలరోజులపాటు విశ్రాంతి తీసుకున్నాడు. లక్ష్య సినిమా కోసం నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశాడని, దానిని కంటిన్యూ చేయడం కోసం డైటింగ్ చేస్తుండడంతోనే నాగశౌర్య డీహైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది.
కొత్త సినిమా షూటింగ్లో ఓ ఫైట్ సీన్ కోసం గత మూడు రోజులుగా నాగశౌర్య వాటర్ తాగడం లేదట. ఈ నెల 20వ తేదీన బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో నాగశౌర్య వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే, పెళ్లికి ఐదు రోజుల ముందు ఈ సంఘటన జరగడంతో శౌర్య ఫ్యామిలీ, అనూష శెట్టి కుటుంబం, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నాగ శౌర్య త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు.