రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవించి, ఇటీవలే విడుదలైన నళిని శ్రీహరన్ తో రాజీవ్ కుమార్తె ప్రియాంక గాంధీ గతంలో ముఖాముఖి కలిసినప్పుడు.. “మానాన్నను ఎందుకు చంపారు? ఆ అవసరం ఏమొచ్చింది“ అని ప్రశ్నించినట్టు తాజాగా నళిని మీడియాకు తెలిపారు. అయితే, ఆ ప్రశ్న అడిగిన కాసేపటికే ప్రియాంక భావోద్వేగానికి గురై ఏడ్చారని ఆమె తెలిపారు.
2008లో వేలూరు సెంట్రల్ జైలులో తనను కలిసిన ప్రియాంక గాంధీ.. ఆమె తండ్రి రాజీవ్ హత్య గురించి పలు ప్రశ్నలు అడిగారని అన్నారు. ఆ సమయంలో ప్రియాంక భావోద్వేగానికి గురై ఏడ్చారని నళిని తెలిపారు. తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు నళిని శ్రీహరన్. రెండు నెలల గర్భవతి అయినప్పటికీ తనను జైలులో బంధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబమే తనకు తొలి ప్రాధాన్యం అని తెలిపారు.
“తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిక్ కలసి.. ఆయనకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్న. గాంధీ కుటుంబానికి కృతజ్ఞతలు. ఆ కుటుంబాన్ని కలిసే అవకాశం దొరికితే వారిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నా. సోమవారం తిరుచ్చి శరణార్థుల శిబిరంలో ఉన్న నా భర్త శ్రీహరన్ను కలుస్తా. నా కుమార్తె కూడా ఆయన్ను కలిసేందుకు ఉత్సాహంగా ఉంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను చూడాలనుకుంటున్నా. నా భర్తను వీలైనంత త్వరగా శరణార్థుల శిబిరం నుంచి విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. రాజీవ్ హత్య కేసు నుంచి బయటపడేందుకు నాకు సహకరించిన వారందరినీ కలవాలనుకుంటున్నా“ అని నళిని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని శ్రీహరన్ సహా మొత్తం ఆరుగురు దోషులు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వీరందరినీ విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి శిక్షను తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసిన సంగతిని గుర్తుచేసింది. కారాగారంలో వీరందరి ప్రవర్తన సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపింది.
ఇదే కేసులో 30 ఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించిన పెరారివాలన్ విడుదలకు.. రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మే 18న ఆదేశాలు జారీ చేసింది. అదే తీర్పు మిగతా ఆరుగురు దోషులకూ వర్తిస్తుందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దోషులు విడుదలయ్యారు.