వైసిపి ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో కొద్ది నెలలుగా సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, నగరిలో కొందరు స్థానిక నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ రోజా ఇటీవల స్వయంగా మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా వైరల్ గా మారింది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయినప్పటికీ తనకు తెలియకుండానే చాలా కార్యక్రమాలను కొందరు స్థానిక నేతలు నిర్వహిస్తున్నారు అంటూ రోజా షాకింగ్ ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో మరోసారి నిరసన శగ తగిలింది. నగరి నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట మండలం పత్తి పుత్తూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా రోజాకు షాక్ తగిలింది. రోజా ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్తున్న సందర్భంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజా వ్యతిరేక వర్గానికి చెందిన గ్రామం కావడంతో ఆమెను అడ్డుకునేందుకు ఆ వైరి వర్గం నేతలు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే రోజాను అడ్డుకునేందుకు వడమాలపేట మండల జడ్పిటిసి మురళీధర్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రోజా చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావడానికి సిద్ధంగా ఉన్న ఆ భవనానికి మురళీధర్ రెడ్డి తాళం వేయడం సంచలనం రేపింది. ఆ భవనాన్ని తానే నిర్మించానని, దానికి సంబంధించిన బిల్లులు ఇంకా రాలేదని, ఆ బిల్లులు ఇప్పిచ్చిన తర్వాత తాళం తీస్తానని ఆయన భీష్మించుకు కూర్చోవడం షాకింగ్ గా మారింది.
ఈ క్రమంలోనే మురళీధర రెడ్డి వర్గీయులతో రోజా వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య పరస్పర వాగ్వాదం, దాడులు జరిగాయి. ఆ తర్వాత ఆ భవనానికి వేసిన తాళాన్ని రోజా వర్గీయులు పగలగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేసి మురళీధరరెడ్డితో పాటు రవి రెడ్డిని అరెస్టు చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత గ్రామానికి చేరుకున్న రోజా గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించడంతో వ్యవహారం సద్దుమణిగింది. ఏది ఏమైనా మంత్రి హోదాలో ఉన్న రోజాకు సొంత పార్టీ నేతల నుంచి నిరసన వ్యక్తం కావడం హాట్ టాపిక్ గా మారింది.