కొన్ని ఉదంతాల గురించి విన్నంతనే.. ఇదెక్కడి విచిత్రంరా బాబు? ఇలా కూడా జరుగుతుందా? అన్న సందేహం కలుగుతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. పెళ్లికి ఇచ్చిన లెహంగా పెళ్లి కుమార్తెకు నచ్చకపోవటం.. కట్ చేస్తే పెళ్లి రద్దైన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. లెహంగా నచ్చకపోతే పెళ్లి రద్దు అయిపోతుందా? అంటే.. ఈ ఉదంతాన్ని చూసిన తర్వాత నిజమే అనుకోవాల్సిందే.
ఇంతకూ అసలేం జరిగిందంటే..
ఉత్తరాఖండ్ కు చెందిన ఒక యువతికి.. అల్మోరాకు చెందిన ఒక యువకుడితో వివాహం నిశ్చయమైంది. ముందుగా అనుకున్న ప్రకారం నవంబరు ఐదున పెళ్లి కావాల్సి ఉంది. అంటే.. ఐదు రోజుల క్రితమే వారి పెళ్లి ఘనంగా జరగాల్సి ఉంది. అయితే.. అంతలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పెళ్లి నేపథ్యంలో పెళ్లి కొడుకు వాళ్లు శుభలేఖలు సైతం అచ్చు వేయించారు. పెళ్లి కుమార్తె కోసం పెళ్లి కుమారుడి తండ్రి ఒక ఖరీదైన లెహంగాను ఎంపిక చేసి.. పెళ్లి కుమార్తెకు పంపారు. అయితే.. వారిచ్చిన లెహంగా పెళ్లి కుమార్తెకు నచ్చలేదు. ఇదే విషయాన్ని ఆమె చెప్పేసింది. ఈ విషయం పెళ్లి కొడుకు ఇంట్లో తెలిసింది. తాము ఇచ్చిన ఖరీదైన లెహంగా నచ్చకపోవటం ఏమిటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ చిన్న విషయం అంతకంతకూ పెరిగి రచ్చగా మారింది.
నచ్చని లెహంగా గురించి మొదలైన వాదన.. మాటా మాటా పెరగటం.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. దీంతో.. ఈ పెళ్లి జరిగేదే లేదంటూ ఇరు వర్గాలు నిర్ణయించాయి. దీంతో సెటిల్ మెంట్ లో భాగంగా పెళ్లి కుమార్తెకు రూ.లక్ష ఇచ్చేసి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే.. ఈ సంబంధం గురించి అమ్మాయి తరఫు వారు మరోసారి ముందుకు వచ్చి.. పెళ్లి గురించి ప్రస్తావన తేవటంతో అబ్బాయి తరఫు వారు ఓకే చెప్పారు. అయితే.. మళ్లీ మాటల కోసం కూర్చున్న తర్వాత లెహంగా ముచ్చట రావటం.. విషయం మళ్లీ వాగ్వాదానికి తీయటంతో.. పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లుగా డిసైడ్ అయిపోయారు. పెళ్లి క్యాన్సిల్ కావటానికి ఇంత సిల్లీ రీజనా? అంటూ విస్మయానికి గురి అవుతున్నారు.