తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితోపాటు మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించిన ఘటన దేశ రాజకీయాలను కుదిపేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో పోలీసుల దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టు గతంలో స్టే విధించింది. అయితే, తాజాగా నేడు ఆ కేసుపై మరోసారి విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు దర్యాప్తును మొయినాబాద్ పోలీసులు కొనసాగించవచ్చంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంతేకాదు, ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని బిజెపి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు పెండింగ్ లో పెట్టింది. ఆ వ్యవహారంపై ఈనెల 18న విచారణ జరిపి నిర్ణయం ప్రకటి స్తామని హైకోర్టు వెల్లడించింది. వాస్తవానికి నిందితుల కస్టడీకి ఏసీబీ కోర్టు నిరాకరించింది. దీంతో, తెలంగాణ పోలీసులు నిందితుల రిమాండ్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే నిందితులను రిమాండ్ కు పంపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తుపై గతంలో స్టే విధించింది. అయితే, తాజాగా ఆ స్టేను హైకోర్టు ఎత్తివేసింది. అంతేకాదు, నిందితుల రిమాండ్ కోసం కూడా పోలీసులు ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా తెలంగాణ హైకోర్టు తీర్పుతో బీజేపీకి షాక్ తగిలినట్లయింది. దీంతో, ఈ నెల 18న హైకోర్టు వెలువరించబోయే ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.