సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్.. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి.. యువనటుడు విశ్వక్ సేన్ తీరుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన కుమార్తెను హీరోయిన్ గా పెట్టి తీస్తున్న మూవీకి సంబంధించిన సంచలన అంశాల్ని ఆయన ప్రస్తావించారు.
తన సినిమాలో హీరోగా చేస్తున్న విశ్వక్ సేన్ వైఖరి మీదా.. అతగాడు వ్యవహరించిన తీరుపై తాను ఎంతలా ఇబ్బంది పడ్డానన్న విషయాన్ని అర్జున్ చెప్పటం.. దానిపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరగటం తెలిసిందే.
మల్టీ టాలెంటెడ్ గా పేరున్న విశ్వక్ సేన్.. ఇటీవల కాలంలో కాంట్రావర్సీల్లో అతగాడి పేరు తరచూ నలగటం తెలిసిందే. తన సినిమా విషయంలో అతగాడి వైఖరిపై ఓపెన్ అయిన అర్జున్ ప్రెస్ మీట్ కు సమాధానాన్ని చెప్పేశారు విశ్వక్ సేన్.
అందుకు రాజయోగం సినిమా టీజర్ కార్యక్రమానికి హాజరై మరీ ఓపెన్ అయ్యారు. ఓపక్క అర్జున్ సార్ అని ప్రస్తావిస్తూ.. ఆయనకు సారీ చెప్పినట్లే చెప్పి.. తనదైన శైలిలో కౌంటర్ వేసినట్లుగా చెబుతున్నారు.
తన ప్రెస్ మీట్ లో అర్జున్ ప్రస్తావించిన కీలక అంశంలో షూటింగ్ రోజున రావాల్సిన విశ్వక్.. ఆ రోజు ఉదయం తనకు మెసేజ్ పంపి.. షూటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పిన వైనాన్ని ఒప్పుకోవటం గమనార్హం. అయితే.. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానిపై ఆయన చెప్పిన మాటల్ని ఆయన మాటల్లోనే చదివితే..
– నటుడ్ని అయ్యేందుకు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. అవమానాలు ఎదుర్కొన్నా. ఇప్పుడు వీడు బాగానే ఉన్నాడు కదా అనుకుంటూ వాటి గురించి ఎవరూ మాట్లాడరు. కానీ.. నటుడిగా మాత్రం నేను వాటినే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే.. మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని. ఏదో అవకాశం వచ్చేసింది కదా అని నేను సినిమాలు చేయను. ప్రేమతో చేస్తుంటా. సినిమాకు సంబంధించిన అన్ని పనులను చూసుకుంటూ.. అది పూర్తియన తర్వాత ప్రచారాన్ని భుజాన వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటా.
– నా అంతటి ప్రొఫెషనల్.. కమిట్ మెంట్ ఉన్న నటుడు మరొకరు ఉండదు. ఈ ఏడాది నేను మూడు సినిమాలు పూర్తి చేశా. వాటిల్లో ఒక దానికి నేనే దర్శకుడ్ని.. నిర్మాతను.. హీరోను కూడా నేనే. నా వల్ల ఇప్పటివరకు ఏ నిర్మాత బాధ పడలేదు. ఒక్క రూపాయి నష్టపోలేదు.
– చిన్న నిర్మాతలతో పని చేయకపోవటానికి కారణం భయమే. నేను చేసినవన్నీ చిన్న సినిమాలే కావొచ్చు. కానీ.. వాటిని పెద్ద నిర్మాతలు నిర్మించారు. నా సినిమాల్లో సెట్ లో ఉండే ఒక్క లైట్ బాయ్ అయినా నన్ను కమిటెడ్.. ప్రొపెషనల్ నటుడ్ని కాదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా.
– కొత్త దర్శకుడితో అయినా.. అనుభవం ఉన్న దర్శకుడితో అయినా ‘గివ్ అండ్ టేక్’ పద్దతిలో పని చేశా. అన్ని సినిమాలకు మాదిరే అర్జున్ గారి చిత్రానికి కూడా అలానే అనుకొని ప్రారంభించా. షూటింగ్ ప్రారంభానికి వారం ముందు సినిమా స్క్రిప్టు అందింది. తాను ఆఫీస్ బాయ్ ఇన్ పుట్ కూడా వింటానని అర్జున్ సార్ అన్నారు. అలాంటి ఆయన.. నేను ఫలానా మార్పు చేస్తే బాగుంటుంది సర్ అంటే.. నన్ను నమ్ము.. నువ్వు వదిలేయ్ అంటూ ఏమీ చెప్పనిచ్చేవారు కాదు.
– పది నిమిషాల్లో రెండు విషయాల్ని నా ఇష్టానికి వదిలేసేలా జరిగింది. నన్ను కట్టి పడేశారు. కళ్లుమూసుకొని కాపురం చేసేయ్ అన్నట్లుంది వ్యవహారం. అయినా ఏదో విధంగా ముందుకు వెళ్లాలని అనుకున్నా. లుక్ టెస్టులో పాల్గొని ఆయనకు పంపా. తర్వాతి రోజు లేచి షూటింగ్ కు వెళ్లాలని అనుకునే సమయంలో ఎందుకో భయం వేసింది. అంతకు ముందు మరే సినిమాకు నాకు అలా అనిపించలేదు. అందుకే.. సర్.. ఈరోజు షూటింగ్ రద్దు చేస్తే.. కొన్ని విషయాలు మాట్లాడుకుందామని మెసేజ్ పెట్టా.
– నేను.. మా మేనేజర్ ఎన్నిసార్లు అడిగినా ఆయన నుంచి సమాధానం రాలేదు. అదే రోజు మధ్యామ్నం వాళ్ల మేనేజర్ నుంచి మాట్లాడేదేమీ లేదంటూ అకౌంట్ వివరాలు పంపారు. సినిమా నుంచి తప్పుకంటానని చెప్పలేదు.. సినిమాను నేను ఆపలేదు.
– షూటింగ్ ప్రారంభానికి ముందు క్యాన్సిల్ చేయటం తప్పే. కానీ.. నాలుగు రోజులు ఇష్టం లేకుండా పని చేసి.. తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలని అనుకోవటం ఇంకా పెద్ద తప్పు. నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్యే మాట్లాడా. అంత గౌరవం ఇచ్చా. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టటం వల్ల నా ఫ్యామిలీ.. స్నేహితులు బాధ పడుతున్నారు. నేనేం చేయాలి?
– సినిమా బాగా రావటానికి మాట్లాడుకుందామని మెసేజ్ పెట్టా. అర్జున్ సార్ మంచి సినిమా చేయాలి. వాస్తవాలు తెలీకుండా మాట్లాడుతుంటే బాధగా ఉంది. నేను ఏమి చేసినా సినిమా బాగా రావటం కోసమే చేశా. సెట్ లో కంఫర్టుగా లేకపోతే చేయలేను. నా పరిస్థితి గురించి మీకు చెప్పా. తప్పా.. రైటా అనేది మీరే చెప్పండి. రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హిమాలయాలకు వెళ్దామని అననుకున్నా.
– ఆయన సినిమా నుంచి నన్ను తొలగించారు కాబట్టి.. ఆయన సినిమా గురించి ఎందుకు మాట్లడాలి? అనుకొని స్పందించలేదు. సినిమాల విషయంలో తప్పు చేశానా చెప్పండి. ఇప్పుడే పరిశ్రమను విడిచి వెళ్లిపోతా. నా వల్ల మీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి సార్.