కెరీర్ ఆరంభం నుంచి వరుస హిట్లతో దూసుకుపోతూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల అనిల్ రావిపూడి నుంచి వచ్చిన `ఎఫ్ 3` సినిమా సైతం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని నటసింహం నందమూరి బాలకృష్ణ తో చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.
`ఎన్బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించబోతున్నాడు. తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా సాగే కథ ఇది. బాలయ్యకు కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంపిక అయిందన్న విషయాన్ని ఆల్రెడీ అనిల్ రావిపూడి రివిల్ చేసేశాడు.
అలాగే ఈ సినిమాకి `రామారావుగారు` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే `ఎన్బీకే 108` షూటింగ్ ను నవంబర్ లో ప్రారంభించి.. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనిల్ రావిపూడి పక్కాగా ప్లాన్స్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ప్లాన్స్ అన్ని బాలయ్య తారుమారు చేసేశారట.
ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ కంప్లీట్ కాలేదు.
బాలయ్య ఆహా వేదికగా ప్రసారం అవుతున్న టాక్ షో `అన్‌స్టాపబుల్ సీజన్ 2` షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీని కారణంగా `వీర సింహారెడ్డి` షూటింగ్ కు బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పెండింగ్ లోనే ఉంది. ప్రస్తుతం బాలయ్య ఓవైపు `అన్‌స్టాపబుల్ 2` తో పాటు `వీర సింహారెడ్డి` షూటింగ్ ను పూర్తి చేసే పనిలో బిజీగా గడుపుతున్నారు.
దీంతో ఈ ఏడాది అనిల్ రావిపూడి-బాలకృష్ణ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ తర్వాతే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక షూటింగ్ ఆలస్యమైతే రిలీజ్ ను కూడా పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తానికి అలా ఎన్బీకే 108 విషయంలో అనిల్ రావిపూడి ప్లాన్స్ అన్నీ తారుమారు అయిపోయాయట.