బీసీలే పార్టీకి ఆయు వు పట్టు అని.. బీసీ అజెండానే తమ అజెండా అని చెప్పుకొనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు దూరమైంది. నిజానికి ఎన్నికలకు ముందు కూడా పార్టీ అధినేత చంద్రబాబు బీసీ జపమే చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీలకే ఎక్కువ స్థానాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రాష్ట్రంలోని పార్టీలో కీలక పదవులను కూడా వారికే కేటాయించారు. అయినప్పటికీ.. ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఎక్కడా బీసీలు టీడీపీకి అనుకూలంగా మారింది కనిపించలేదు.
ఫలితంగా బీసీ జనాభా ఓటింగ్ టీడీపీకి దూరమైందనే వాదన ఉంది. దీనిపై ఇప్పుడు టీడీపీలో అంతర్మథనం సాగుతోంది. అసలు ఏమైంది ? ఎందుకు బీసీ ఓటు బ్యాంకు దూరమైంది ? అనే అంశాలపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో కీలక బీసీ నాయకులు అందరూ భేటీ అయి.. చర్చిస్తున్నారు. అయితే.. దీనిపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నా.. ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నారు ? అనేది కీలకంగా ప్రస్తావనకు వస్తోంది. కొత్తవారిని ఎవరినైనా ప్రోత్సహిస్తున్నారా ? లేక ఉన్నవారికే పదవులు ఇస్తున్నారా ? అనేది ప్రశ్న.
ఇప్పటి వరకు టీడీపీ అనుసరించిన విధానాలను పరిగణనలోకి తీసుకుంటే.. చిత్రమైన సంగతులే కనిపిస్తున్నాయి. కొత్తవారికి ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు. ఒకటికి రెండు సార్లు ఓడిన నేతలు, పాత తరం నేతల వారసులకు.. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నవారికి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కొత్తగా బీసీ నేతలు వస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాదు.. బీసీ కేడర్ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉంది.
ఇక, వైసీపీని తీసుకుంటే.. పాతతరం నేతలను, వారి వారసులను కూడా కీలక పదవులకు దూరంగా పెట్టడంతోపాటు.. వారి సేవలను ఎక్కడ వినియోగించుకోవాలో అక్కడి వరకు వినియోగించుకుని.. పదవుల విషయంలో మాత్రం కొత్తవారికి అవకాశం ఇస్తుండడం బీసీ వర్గంలో జోష్‌కు కారణంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీసీల్లో యువతకు, కొత్త తరం వారికి జగనే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. అంతెందుకు విజయవాడ లాంటి జనరల్ సీట్లలో కూడా జగన్ బీసీలకే మేయర్ సీటును బీసీలకు కట్టబెట్టడం సంచనలమే అయ్యింది.
ఇక బీసీల్లో మహిళలకు కూడా జగనే ఎక్కువ పదవులు ఇస్తున్నారు. తాజా మునిసిపల్ చైర్మన్, మేయర్ పదవులు చూస్తే బీసీల్లో చాలా కులాలను జగన్ కవర్ చేశారు. గతంలో టీడీపీ ఎప్పుడూ పదవులు ఇవ్వని కులాలకు కూడా పదవులు వచ్చాయి. జనరల్ సీట్లలోనూ వారికే ఎక్కువ పదవులు ఇచ్చారు. ఈ మార్పులతో టీడీపీ కంచుకోటగా ఉన్న బీసీ ఓటు బ్యాంకు కరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ఈ తరహా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నది వాస్తవం.