తెలంగాణలో భారత్ జూడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో బీఆర్ఎస్ తో అరంగేట్రం చేయడాన్ని రాహుల్ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ నేతగా, ప్రధానిగా అవతరించాలనుకుంటున్న రాహుల్ గాంధీ…తన సొంత నియోజకవర్గంలో గెలవాలని కేటీఆర్ సెటైర్లు వేశారు.
అటువంటి వ్యక్తి కేసీఆర్ పై విమర్శలు చేయడం విడ్డూరం అని విమర్శించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఆశయాలను రాహుల్ గాంధీ విమర్శించారని, ప్రధాని కావాలని కలలు కంటున్న వ్యక్తి తనను ఎంపీగా ఎన్నుకోవాలని సొంత నియోజకవర్గ ప్రజలను ఒప్పించాలని అన్నారు. ఇక, 2019లో ఏపీలోని అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేసిన రాహుల్ గాంధీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా రాహుల్ పోటీ చేసి గెలవడంతో ఆయన లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. మీరు డబ్బా కొట్టుకుంటున్న జాతీయ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైన సంగతి గుర్తుందా అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ చురకలంటించారు. ఇక, కన్న కూతురిని ఎంపీగా గెలిపించుకోలేకపోయారని కేసీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ అంటూ డ్రామారావు అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి కేటీఆర్ పై రేవంత్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.