సీఎం జగన్, వైసీపీ నేతలపై టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ లోపల, వెలుపల జగన్ పాలనను అచ్చెన్నాయుడు తీవ్రంగా ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడును వైసిపి అధినేత జగన్ తో పాటు మంత్రి రోజా, మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. అచ్చెన్నను జైలుకు కూడా పంపాలని వైసీపీ నేతలు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడు ఓటమే లక్ష్యంగా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. అచ్చెన్నకు పెట్టని కోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గాన్ని జగన్ టార్గెట్ చేశారు. 2024 ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండా ఎగరవేయాలంటూ ఆ నియోజకవర్గ వైసిపి నేతలకు జగన్ దిశా నిర్దేశం చేశారు. అచ్చన్న ఓటమికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, వైసిపి నేత పేరాడ తిలక్ తదితరులతో జగన్ చర్చించారు.
రాబోయే ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యే టికెట్ ను వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ కు ఫిక్స్ చేసిన జగన్ అతడి గెలుపు కోసం పేరాడ తిలక్ తో పాటు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. టెక్కలిలో గత మూడేళ్లలో దాదాపు 1000 కోట్ల రూపాయలను వివిధ పథకాలకు మంజూరు చేశామని జగన్ అన్నారు. అంతే కాదు టెక్కలిలో శ్రీనివాస్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పేరాడ తిలక్ ను ఎమ్మెల్సీగా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.
దువ్వాడ గెలుపు కోసం పార్టీలోని వర్గ విభేదాలు వీడి పేరాడ తిలక్ తదితరులు కృషి చేయాలని జగన్ ఆదేశించారు. దువ్వాడను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే పేరాడకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని లేదంటే దువ్వాడ మరోసారి ఎమ్మెల్సీ అడిగే పరిస్థితి ఉంటుందని జగన్ అన్నట్టుగా తెలుస్తోంది. దువ్వాడ, పేరాడల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా టిడిపికి కంచుకోటగా ఉన్న టెక్కలిలో అచ్చెన్న ఓటమి కోసం జగన్ ఇప్పటినుంచి స్కెచ్ వేయడం ఆసక్తికరంగా మారింది.