మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మరింత వేడెక్కించింది. ఘర్ వాపసీ మంత్రాన్ని జపిస్తోంది. అదేసమయంలో ఇతరపార్టీల నేతలకు కూడా.. రెడ్ కార్పెట్ పరిచింది. ప్రధానంగా గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి తీసుకోవడం ద్వారా.. “కేసీఆర్‌ను కాదనుకుని తప్పుచేశాం. ఆయనే ఈ రాష్ట్రానికి వెన్నెముక.. ఆయన లేని రాష్ట్రాన్ని ఊహించలేం. ఎన్ని పార్టీలు వచ్చినా.. కేసీఆర్ లాంటి నాయకుడు లేడు. “ అనే కీలక సందేశాన్ని ఎన్నికల ముందు ప్రజలకు చేరుస్తోంది.
మునుగోడులోని వార్డు సభ్యులనుంచి రాష్ట్రస్థాయి నేతల వరకూ పార్టీలో చేర్చుకుంటూ ప్రత్యర్థుల్లో గుబులు రేకెత్తిస్తోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో ఇతర పార్టీల్లోని బీసీ నేతలపై టీఆర్ ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఒకరు పోతే నలుగురు వస్తారనే సంకేతాలిచ్చేలా వ్యవహరిస్తున్న టీఆర్ ఎస్ త్వరలో మరికొందరు రాబోతున్నారని చెబుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్ని సెమీ ఫైనల్‌గా భావిస్తుడటంతో సత్తా చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డు స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆయారాం గయారాంలతో.. రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మునుగోడు పోలింగ్ సమయందగ్గర పడుతుండటంతో ఆపరేషన్ ఆకర్ష్ కు ప్రాధాన్యం ఏర్పడింది.
బీఆర్ ఎస్‌గా మారుతున్న టీఆర్ ఎస్ జాతీయ రాజకీయాలు, మునుగోడు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తనదైన వ్యూహాలను అమలు చేస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఓదెలు దంపతులను పార్టీలోకి ఆహ్వానించి సీఎం కేసీఆర్ గులాబీ కండువాకప్పారు.
టీఆర్ ఎస్‌లో బీసీలకు అవమానం జరుగుతోందన్న బూర నర్సయ్య వ్యాఖ్యలను తిప్పికొట్టేలా కేసీఆర్ వర్గం ముందుకెళ్తోంది. బీసీ నాయకులపై తొలుత దృష్టిపెట్టిన టీఆర్ ఎస్.. ఆ వర్గం వారంతా తమవైపే ఉన్నారనే సంకేతమిచ్చేలా చర్యలు చేపట్టింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించిన పల్లె రవికుమార్‌గౌడ్ దంపతుల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్‌లో చేరారు.
శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, బీజేపీలో ఉన్న దాసోజు శ్రవణ్‌కి ఒకేరోజు ఒకేవేదికపై గులాబీ కండువా కప్పేశారు. వారిద్దరు ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన నాయకులే. టీఆర్ ఎస్‌లో బీసీలు, గతంలో బయటకు వెళ్లిన నేతల చేరికలు ఊపందుకోవడంతో మరికొందరు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. జితేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, తులఉమ, కూన శ్రీశైలం గౌడ్ తదితర నాయకులు చేరతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.