3 రాజధానులు కడతానంటోన్న జగన్.. ఊరికి 3 రోడ్లు కూడా వేయించలేకపోతున్నారని ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ లతో పాటు పలువురు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే జగన్ తీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే ఉంది. ఇటీవల, ఏపీలో చెత్త రోడ్లపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ కూడా ట్వీట్ చేయడంతో ఏపీ పరువు జాతీయ స్థాయిలో మంటగలిసిందని విమర్శలు వచ్చాయి.
ఇక, తాజాగా ఏపీలోని రోడ్ల దుస్థితి గురించి నర్సీపట్నానికి చెందిన చిన్న పిల్లలు సైతం నిరసన వ్యక్తం చేయడంతో జగన్ పరువు నీట మునిగింది. ‘సీఎం సారూ… మా ఊరికి రోడ్డు వేయించండి’ అంటూ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో చిన్న పిల్లలు నీటిలో దిగి చేతులెత్తి నమస్కరించడం సంచలనం రేపింది. ఈ ప్రకారం ప్రచురితమైన పత్రికా కథనం దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు.
ఈ ముఖ్యమంత్రికి ఎలా చెబితే అర్థమవుతుందో ఎవరికీ అర్థంకావడంలేదని ఆయన మండిపడ్డారు. చివరికి చిన్నపిల్లలు సైతం వంతెన అప్రోచ్ రోడ్డు కోసం నిరసనల బాట పట్టే పరిస్థితిని జగన్ కల్పించారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏమీ కట్టలేరని ప్రతి ఒక్కరికీ తెలుసని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను పూర్తిచేసినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
తమ హయాంలోనే వరాహ నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టామని, కానీ, జగన్ పగ్గాలు చేట్టిన తర్వాత పెండింగ్లో ఉన్న ఆ కొద్దిపాటి అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తి చేయడం చేతకాలేదని మండిపడ్డారు. అందుకే మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు రోడ్డు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజా సమస్యలపై ఇగో వద్దు జగన్ రెడ్డీ… ఇష్యూని సాల్వ్ చేయండి” అంటూ చంద్రబాబు ఆ పిల్లల ఫొటోను ట్వీట్ చేస్తూ హితవు పలికారు.