మొగల్తూరులోని చిరంజీవి తన సొంత ఇంటిని అమ్మేసుకున్నారని, లైబ్రరీ కోసం ఆ ఇల్లు ఇవ్వమని అడిగితే చిరంజీవి ఇవ్వను పోండి అన్నారని చాలాకాలంగా ఓ వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. చిరు పక్కా కమర్షియల్ అని, కేవలం 3 లక్షలకు కక్కుర్తి పడి సొంత ఇంటిని అమ్మేశారనే ప్రచారం ఉంది. అయితే, ఈ వార్త నిజమేనా? ఇందులో వాస్తవ అవాస్తవాలేమిటి? అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ జర్నలిస్ట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. ఆ ఇల్లు చిరంజీవిదేకాదని, అలాంటపుడు ఆయన ఎలా అమ్ముతారని ప్రభు ఆ పుకార్లను కొట్టిపారేశారు. ప్రజారాజ్యం పార్టీ ప్రకటనకు, ఎన్నికలకు మధ్య ఈ ప్రచారం ముమ్మరంగా జరిగిందని, చిరు పార్టీపై బురదజల్లేందుకే జరిగిన ఈ ప్రయత్నంలో ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారని అన్నారు. ‘మొగల్తూరు’లో చిరంజీవికి ఇల్లూ, స్థలం లేదని, మొగల్తూరు చిరు పుట్టిన ఊరు మాత్రమేనని చెప్పారు.
చిరంజీవి గారి తండ్రి వెంకట్రావుగారు ఉద్యోగ రీత్యా ఎన్నో ఊళ్లలో పనిచేయాల్సి వచ్చిందని, దాంతో, చిరంజీవి కుటుంబానికి స్థిరమైన ఇల్లు అనేది ఉండేది కాదని అన్నారు. మొగల్తూరులోది చిరంజీవిగారి తాతగారి ఇల్లు అని, చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి ముందే ఆ ఇంటిని వాళ్ల తాతగారు అమ్మేసుకున్నారని చెప్పారు. ఆ ఇంటితో చిరంజీవిగారికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
అయితే, ముందు నుంచి కూడా చిరు తన స్థాయికి తగని విషయాలను పట్టించుకోరని, అందుకే ఆ తరహా ప్రచారాలను ఖండించే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఆ కారణంతోనే ఈ ప్రచారం అలా కొనసాగుతూనే వచ్చిందని అసలు విషయం చెప్పారు. దానికితోడు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత రాజకీయ ఒత్తిళ్లు, పార్టీ విలీనం వంటి కారణాల నేపథ్యంలో ఈ విషయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చిరు చేయలేదని అన్నారు. ఇక, 1998 నాటికే చిరంజీవి పేరు మీద మొగల్తూరులో గ్రంథాలయం ఉండడం కొసమెరుపని ప్రభు చెప్పుకొచ్చారు. మరి, ఈ క్లారిటీతోనైనా చిరుపై వస్తున్న పుకార్లకు చెక్ పడుతుందో లేదో వేచి చూడాలి.