అక్టోబర్ 20న వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా గుంటూరు ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్రీకే రన్ ను నిర్వహించారు. గుంటూరులోని గుజ్జనగుండ్లలో ఉన్న డ్రైవ్ ఓ పోలిస్ సెంటర్ నుంచి సాయిబాబా రింగు రోడ్డు వరకు ఈ త్రీకే (3k) రన్ కార్యక్రమం జరిగింది. ‘స్టెప్ అప్ బోన్ హెల్త్’ అనే నినాదంతో నిర్వహించిన ఈ త్రీకే (3k) రన్ లో నగరానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్లు పలువురు పాల్గొన్నారు.
బోలు ఎముకల వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే నాడు ఈ త్రీకే (3k) రన్ కార్యక్రమం చేపట్టామని డాక్టర్ కంచర్ల రామ్ ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్ల వలన కొందరిలో చిన్న వయసు నుంచే ఎముకలు గుల్ల బారడం, పెళుసుగా మారడం, విరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్ చేయాలని సూచించారు.
కాగా, ఎముకల్లో కాల్షియం సాంద్రత లోపించడం వల్ల ఎముకలు పెళుసు బారి త్వరగా విరిగే అవకాశం ఉంటుందని డాక్టర్ కె. రాజశేఖర రెడ్డి అన్నారు. అందుకే, ప్రజలు తమ ఆహారంలో క్రమం తప్పకుండా కాల్షియం, విటమిన్ డి ఉండేలా చూసుకోవాలని, ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం, వాకింగ్ చేయాలని సూచించారు. పల్స్ ఫార్మాస్యుటికల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ త్రీకే (3k) రన్ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి.బిందేష్, డాక్టర్ ఎస్. అమర్ నాథ్, డాక్టర్ వై.వి.కె దుర్గా ప్రసాద్, డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, డాక్టర్ లక్ష్మీ నారాయణ, డాక్టర్ ఎం.వినోద్ కుమార్, డాక్టర్ ఎం.శివ కుమార్, డాక్టర్ వై తులసీ రామ్, డాక్టర్ సీతారాం ప్రసాద్, పల్స్ ఫార్మాస్యుటికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.