వైసీపీ నేతలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీపై కూడా పవన్ కల్యాణ్ పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ ఏపీ నేతలతో తనకు సెట్ కావడం లేదని, బీజేపీకి ఊడిగం చేయలేమని షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక, పవన్ వ్యాఖ్యలను సమర్థించిన ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ…సోముపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ నాయకుడు పవన్ అంటూ జనసేనానిని సోము ఆకాశానికెత్తేశారు. పవన్ ను చంద్రబాబు కలిసి సంఘీభావం తెలిపారని, దీనిని స్వాగతిస్తున్నామని సోము అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, ఆనాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తిరుపతిలో రాళ్ల దాడి ఘటన గుర్తు చేసుకోవాలని చంద్రబాబునుద్దేశించి సోము చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ పేరుతో జరుగుతోన్న ఉమ్మడి ఉద్యమం అంశంపై మీడియా అనవసరంగా బీజేపీని ప్రశ్నించాల్సిన పని లేదని సోము చెప్పారు. రాజకీయాల్లో అన్నీ ఉంటాయని, కన్నా కామెంట్లను కూడా అదే కోణంలో చూస్తామని అన్నారు. అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో తాను బాధ్యతగల పదవిలో ఉన్నానని, కన్నా వ్యాఖ్యలపై స్పందించబోనని అన్నారు. ఇక, పవన్ తో కలిసి పని చేస్తామని, జనసేనతో కలిసి రూట్ మ్యాప్ తయారు చేసుకుంటామని సోము చెప్పారు. దీంతో, పవన్ తో బీజేపీకి పూర్తిగా సంబంధాలు తెగిపోలేదన్న కోణంలో సోము చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.