ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీడీపీ, జనసేన కలిసి పోరాడతాయని ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పవన్, చంద్రబాబుల ముసుగు తొలగిందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నేడు జరుగుతున్నది మరో స్వాతంత్ర్య పోరాటం అని, వైసీపీ ప్రభుత్వ రౌడీయిజం, అరాచకాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడి ప్రణాళికతో చంద్రబాబు, పవన్ ముందుకు వెళ్లాలనుకుంటున్నారని అన్నారు.
పవన్ కు చంద్రబాబు సంఘీభావం తెలపడంతో ఏం చేయాలో వైసీపీ మంత్రులు, నాయకులకు పాలుపోవడం లేదని, అందుకే మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబు కలయికతో వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలందరికీ డైపర్లు పంపిస్తామని, ఇకపై వాటిని తొడుక్కొని తిరిగితే మంచిదని పట్టాభిరామ్ వేరే లెవల్లో సెటైర్లు వేశారు.
ప్యాకేజీలంటూ వైసీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని, అడ్డంగా ప్రజాధనాన్ని దోచుకోవడం, ప్యాకేజీలివ్వడం వైసీపీ నేతలకు అలవాటని పట్టాభిరామ్ మండిపడ్డారు. 2004లో కేసీఆర్ కు వైఎస్ఆర్ ఏం ప్యాకేజి ఇచ్చి మద్దతు పొందారని పట్టాభి నిలదీశారు. ప్యాకేజీలకు పేటెంట్ జగన్ రెడ్డిదేనని, ఆయన ప్యాకేజిల బాగోతం రాష్ట్రం అంతా చూస్తోందని విమర్శించారు. టీడీపీ ఆఫీసులపై దాడి చేసినపుడు వైసీపీ వీధికుక్కలు, సైకోగాళ్లు ఏం పట్టుకొని వచ్చారో తెలియదా? అంటూ మండిపడ్డారు.
చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేశ్..మరోసారి కూడా దాడి చేస్తానని అదో ఘనతలా చెప్పారని, ఈసారి చంద్రబాబు ఇంటి దరిదాపులకు వస్తే తాటతీస్తామని పట్టాభిరామ్ హెచ్చరించారు. కులగజ్జితో పబ్బం గడుపుకుంటున్నది ఎవరో అందరికీ తెలుసని గుడివాడ అమర్నాథ్ పై మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలకు బీపీలు వచ్చి టీడీపీ ఆఫీసులపై దాడిచేశారని జగన్ అన్నారని, జగన్ పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజలకు కూడా బీపీలు వస్తాయని చెప్పారు.