రాజధాని అమరావతి కోసం మహా పాదయాత్ర చేస్తున్న రైతులపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూ పాదయాత్రను అడ్డుకునేందుకు ముందు నుంచి విఫల యత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమండ్రిలో రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు మరమ్మతుల పేరుతో రాజమండ్రి బ్రిడ్జిని అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహా పాదయాత్ర శాంతియుతంగా రాజమండ్రిలోని ఆజాద్ చౌక్ వద్దకు చేరుకుంది.
అదే సమయంలో పాదయాత్రను అడ్డుకునేందుకు ముందుగానే ప్రిపేర్ అయి ఉన్న వైసీపీ శ్రేణులు, వికేంద్రీకరణ మద్దతుదారులు కూడా ఆజాద్ చౌక్ వద్దకు చేరుకున్నారు. దీంతో, ఇరు వర్గాల మధ్య అమరావతి వ్యతిరేక, అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఈ నేపథ్యంలోనే రైతులపైకి వైసీపీ శ్రేణులు చెప్పులు, వాటర్ బాటిళ్లు విసరడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైతులను రెచ్చగొట్టేలా గోబ్యాక్ అంటూ నల్లబెలూన్లు ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి.
దీంతో, వైసీపీ శ్రేణుల చర్యకు ప్రతిచర్యగా రైతులు కూడా స్పందించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు, చెప్పులు విసురుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో, వైసిపి, టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పోటాపోటీ నినాదాలతో రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్ హోరెత్తింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకుంటున్నారు.
ఇక, ఈ ఘర్షణ సమయంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కూడా వైసీపీ శ్రేణులకు మద్దతుగా అక్కడ ఉన్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, అమరావతి రైతులు తమపై బత్తాయిలు, వాటర్ బాటిళ్లు, రాళ్ల దాడికి పాల్పడ్డారని మార్గాని భరత్ ఆరోపించారు.