జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న టిడిపి కార్యకర్తలను సిఐడి పోలీసులు వేధిస్తున్నారని టిడిపి నేతలు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టిడిపి కార్యాలయంలో మీడియా ఇన్చార్జిగా పనిచేస్తున్న నరేంద్రను ఇటీవల హఠాత్తుగా అర్ధరాత్రి సమయంలో సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. అంతేకాదు, వైసిపి రెబల్ ఎంపీ రఘురామ మాదిరిగానే తనను కస్టడీలో పోలీసులు కొట్టారని స్వయంగా జడ్జి ముందు నరేంద్ర ఆరోపించారు.
ఈ క్రమంలోనే నరేంద్రకు టిడిపి అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. జగన్ అరాచక పాలనపై స్పందించిన చంద్రబాబు…ఏపీ పోలీసులకు, సిఐడి పోలీసులకు, అధికారులకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. తాను క్లైమోర్ మెన్లకే భయపడలేదని, నలుగురు పోలీసులను చేతిలో పెట్టుకొని జగన్ భయపెడితే భయపడను అని చంద్రబాబు అన్నారు. టిడిపి నేతలు, కార్యకర్తలను కొడుతున్న ఏ పోలీసును వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
వారిని బోన్లో నిలబడతానని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు అధికారం లేకపోవచ్చని, రేపో మాపో వస్తుందని, ఆరోజు తామేంటో చూపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. సిఐడిలో సీఐ నుంచి కానిస్టేబుల్ వరకు అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నామని అన్నారు. పోలీసులను ఇంత ఘోరంగా వాడుకోవచ్చు అని కూడా తాను అనుకోలేదని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ఈ ప్రభుత్వం దిగజార్చిందని చంద్రబాబు మండిపడ్డారు.
తప్పులు చేసిన అవినీతి అధికారులకు కీలక పోస్టులు కట్టబెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కరుడుగట్టిన నేరగాడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉందని జగన్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారని, కీలక వ్యక్తిగా మారిన దస్తగిరి కూడా తనకు ప్రాణహాని ఉందని పదేపదే చెప్పాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.