అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షో రెండో సీజన్ తొలి ఎపిసోడ్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు గెస్ట్ లుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. తన వియ్యంకుడు చంద్రబాబుతోపాటు తన మేనల్లుడు, అల్లుడు అయిన నారా లోకేష్ ను నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఆ షోలో తన రాజకీయ, వ్యక్తిగత జీవితం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఎపిసోడ్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా స్పందించారు. బావాబామ్మర్దులు అబద్ధాలు చెప్పారని ఆ ఎపిసోడ్ పై రోజా విమర్శలు గుప్పించారు. ఆరోజు బాలకృష్ణ కూడా తనతో ఉన్నారని, ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని ఏడ్చానని చంద్రబాబు చెప్పడం జనాలను పిచ్చోళ్లను చేయడమేనని రోజా విమర్శించారు.
తమ మీడియా ద్వారా చెబితే ప్రజలు నమ్మడం లేదని, అందుకే వేరే ఎంటర్టైన్మెంట్ వేదిక ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారని రోజా ఆరోపించారు. ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇదంతా నమ్మేందుకు జనం పిచ్చోళ్ళు కాదని అన్నారు. ఇక, విశాఖపట్నంలో విశాఖ గర్జన నాడే పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించడంపై రోజా స్పందించారు. వైసిపి గర్జనను పక్కదారి పట్టించేందుకే పవన్ విశాఖలో పర్యటిస్తున్నారని రోజా ఆరోపించారు.
విశాఖ ప్రజల సెంటిమెంట్ అని, పక్కదారి పట్టిస్తే సమసిపోదని రోజా అన్నారు. లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్…ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల కష్టాల గురించిన పుస్తకాలు చదవలేదా అని రోజా ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య కూడా గతంలో చెప్పారని రోజా అన్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని విశాఖ అని అక్కడి ప్రజలు, నేతలు ఏకతాటిపైకి వచ్చారని, పవన్ కుప్పిగంతులు వారి ముందు చెల్లవని అన్నారు.