టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై మాజీ మంత్రి కొడాలి నాని అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బూతుల మంత్రి కొడాలి నానిపై కొద్ది రోజులుగా టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. కొడాలి నాని కామెంట్లకు దీటుగా టీడీపీ నేతలు కూడా ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు.
ఎన్నికలకు ముందు అప్పుల్లో ఉన్న కొడాలి నాని ఈరోజు వేల కోట్లు ఎలా సంపాదించారని బుద్ధా వెంకన్న నిలదీశారు. దోచుకోవడాలు, దాచుకోవడాలు కొడాలి నానికి జగన్ కు అలవాటని వెంకన్న ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ఆర్ పునాదులు కదుపుతానని పలుగు పారా పట్టుకుని వెళ్లిన కొడాలి నాని ఇప్పుడు వీరుడు సూరుడు అంటూ వైఎస్ ను పొగుడుతున్నారని చురకలంటించారు. చంద్రబాబు మీద గుట్కా నాని అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఆ స్థాయి అతడికి లేదని బుద్ధా వెంకన్న మండిపడ్డారు.
గతంలో టీడీపీ నేతగా ఉన్న కొడాలి నాని వైసీపీకి వెళ్లారని, ఇప్పుడు చంద్రబాబును తిడుతున్నారని వెంకన్న చెప్పారు. అదే రేపు మరొక పార్టీలోకి కొడాలి నాని వెళితే జగన్ ను కూడా ఇలాగే బూతులు తిడతారని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాలలో కొడాలి నానిని ప్రజలు పిచ్చోడిలా చూస్తున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు వెంకన్న. చంద్రబాబుపై అభిమానంతో టీడీపీ నేతలు, కార్యకర్తలంతా పని చేస్తున్నామని, నాని, జగన్ కలిసినా చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరని బుద్ధా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. మతిభ్రమించి మాట్లాడుతున్న నానికి ఏం సమాధానం చెబుతామని, నాని లాంటివాళ్లు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారని వెంకన్న అన్నారు.