ప్రముఖుడ్ని ఇంటర్వ్యూ చేయటం జర్నలిస్టు పని. కానీ.. దాన్ని ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు. ఆ మాటకు వస్తే.. ఈ పనిని ఇప్పుడు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు మరింత బాగా చేసేస్తున్నారు. దీనికి కారణం.. స్క్రిప్టు రాసేది తెర వెనుక ఉన్న వారు. కానీ.. అడిగేది మాత్రం ప్రముఖులు కావటంతో.. సమాధానాలు చెప్పే సెలబ్రిటీలు సైతం నో ప్రాబ్లం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
కరణ్ జోహార్ కూర్చొని టాప్ హీరోయిన్ బెడ్రూం విషయాలు అడిగితే.. నవ్వులు రువ్వుతూనో.. మెలికలు తిరుగుతూనో… ఏదో సమాధానం చెబుతారే తప్పించి.. పర్సనల్ విషయాలు అడుగుతున్నావ్.. నీ బుద్ధి ఏమైందని మాత్రం విరుచుకుపడరు. ఇదంతా చూసినప్పుడు ప్రశ్నలు అడిగే విషయంలోనూ పాత్రికేయంలో ఉన్న వారి కంటే.. వారి స్థాయికి తగ్గ వారు అడిగితే ఆ లెక్కలు వేరే ఉంటాయన్న విషయం తాజాగా చేస్తున్న కొన్ని ఇంటర్వ్యూల్ని చూస్తుంటే అర్థం కాక మానదు.
టీడీసీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రిగా సుపరిచితుడైన చంద్రబాబును ఇప్పటివరకు ఎంత మంది జర్నలిస్టులు..ప్రముఖులు ఇంటర్వ్యూ చేశారు చెప్పండి? కానీ.. వారెవరూ బయటకు తీసుకురాని బాబు లోపల మనిషిని ఆయన బావమరిది కమ్ వియ్యంకుడు బయటకు తీసుకొచ్చిన వైనం చూస్తే వావ్ అనాల్సిందే. ఆ మాటకు వస్తే బాలయ్యకు ఇచ్చే క్రెడిట్ లో చాలా భాగంగా కంటెంట్ క్రియేటర్ కు కూడా ఇవ్వాల్సిందే. అయితే.. ఆ తరహా కంటెంట్ కు మామూలుగా అయితే బాలయ్య ఒప్పుకోరేమో? తానే ప్రశ్నలు అడిగే కుర్చీలో కూర్చోవటంతో సాధ్యమైందని చెప్పాలి.
రొటీన్ కు భిన్నంగా తాను ప్రశ్నలు వేసి.. ఆసక్తికర సమాధానాలు రాబట్టే పాత్రలో ఇట్టే ఒదిగిపోయిన బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఎంతటి సక్సెస్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. అలాంటి ప్రోగ్రాంకు సంబంధించి సీజన్ 2లో చంద్రబాబుతో ఆయన చేసిన ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ఈ ఇంటర్వ్యూలో అందరూ టచ్ చేసింది రాజకీయ అంశాల్ని మాత్రమే. కానీ.. చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయ నేత తన కుర్ర వయసులో చేసిన చిలిపి పనులు.. మరెంత రొమాంటిక్ గా ఉంటారన్న దానికి సంబంధించి విషయం మీద ఆయన నోటి నుంచి చెప్పించిన అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
మీ జీవితంలో మీరు చేసిన రొమాంటిక్ పనేంటి? అన్న బాలయ్య మాటలకు.. మీరు సినిమాల్లో చేశారు.. నేను స్టూడెంట్ గా చేశానంటూ.. ‘‘అమ్మాయిలు కనిపిస్తే బైక్ సైలెన్సర్ తీసేవాడిని’ అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖం మీద నవ్వు కూడా రాకుండా ఎప్పుడు సీరియస్ గా ఉంటారన్న వ్యక్తి లోపలి ఇంతటి రొమాంటిక్ వ్యక్తి ఉన్నారన్న విషయాన్ని బయటకు తెచ్చినందుకు బాలయ్యకు గట్టి థ్యాంక్స్ చెప్పాల్సిందే.