ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి అన్న నినాదంతో చేపట్టిన మహా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమరావతి టు అరసవెల్లి అంటూ జరుగుతున్న ఈ పాదయాత్రపై వైసీపీ నేతలు మొదటి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పాదయాత్రను అడ్డుకుంటామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఐతంపూడిలో పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. ఆచంట నియోజకవర్గంలోని ఐతంపూడి వద్దకు రైతుల పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా వైసీపీ శ్రేణులు అమరావతి వ్యతిరేక నినాదాలు చేశాయి. ఈ క్రమంలో అమరావతి రైతులు రాజధానికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో, ఐతంపూడిలో కాసేపు స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
రోడ్డుకు ఒకవైపు నిలుచున్న వైసీపీ శ్రేణులు..రైతులకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించాయి. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, నల్లజెండాలు, నల్ల బెలూన్లు పట్టుకొని రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.
ఈ నేపథ్యంలోనే అమరావతి రైతుల పాదయాత్రకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని, పాదయాత్రను భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. పాదయాత్రకు వ్యతిరేకంగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆ లేఖకు రఘురామ జత చేశారు.