అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నానా మాటలు అంటోన్న సంగతి తెలిసిందే. పాలనా వికేంద్రీకరణ అని ఉపన్యాసాలిస్తూ మూడు రాజధానులు కావాల్సిందేనంటూ వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో వైసీపీ అండదండలతో రాజకీయేతర జేఏసీ చేపట్టిన ఉత్తరాంధ్ర గర్జనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి మూడు రాజధానుల వ్యవహారంపై పవన్ సెటైరికల్ గా స్పందించారు. ఏపీని ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా’గా ప్రకటించాలని, 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులను ఏర్పాటు చేయాలని పవన్ పంచ్ డైలాగులతో చురకలంటించారు. అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న మౌంట్ రష్ మోర్ ఫొటోను విశాఖలోని రుషికొండతో పోలుస్తూ పవన్ చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకు మౌంట్ రష్ మోర్ నిదర్శనమని…అదే తరహాలో విశాఖలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ‘మౌంట్ దిల్ మాంగే మోర్’ ధన-వర్గ-కులస్వామ్యానికి, బూతులకు చిహన్నమని జగన్ అండ్ కోను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. ఒకవేళ రాజధాని వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి ఖాయమని జగన్ సర్కార్ భావిస్తుంటే పాతిక రాజధానులు పెట్టాలని చురకలంటించారు.
రాజ్యాంగం, చట్టం, న్యాయ వ్యవస్థ కంటే తామే గొప్ప అని వైసీపీ నేతలు భావిస్తున్నారని పవన్ విమర్శించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను వైసీపీ నేతలు కేర్ చేయడం లేదని పవన్ మండిపడ్డారు.