సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రువర్ గా మారి ఇచ్చిన వాంగ్మూలంతో ఈ కేసు కీలక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో పలువురు నిందితులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రువర్ గా మారడాన్ని ఈ కేసులో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డిలు కోర్టులో సవాల్ చేశారు.
ఇటీవల జిల్లా కోర్టు, హైకోర్టులను వారు ఈ విషయంలో ఆశ్రయించారు. అయితే, ఆ రెండు కోర్టులలో వారికి చుక్కెదురు కావడంతో తాజాగా వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు వారి అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. అప్రువర్ గా మారడాన్ని రద్దు చేయాలని కోరే హక్కు సహ నిందితులుగా ఉన్న వారికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో, సుప్రీం కోర్టులోనూ శివ శంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలకు నిరాశే ఎదురైంది.
అంతకుముందు, శివ శంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కూడా రద్దయిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ కేసు విచారణపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో కేసు దర్యాప్తు సరిగా సాగడంలేదని, నిందితులంతా రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు కావడంతో ఈ కేసు విచారణను పొరుగు రాష్ట్రం తెలంగాణలో గానీ, ఇతర రాష్ట్రంలోగానీ చేపట్టాలని ఆమె కోరారు. ఆ పిటిషన్ పై ఈ నెలాఖరున విచారణ జరిపే అవకాశముంది.