టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ల కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ చిత్రం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆ చిత్ర టీజర్ పై విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ చిత్రంలో హనుమంతుడు, రావణుడి పాత్రలను చిత్రీకరించిన తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పలువురు బీజేపీ నేతలు సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ చిత్రంపై స్టే విధించాలంటూ గౌరవ్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ చిత్రంలో రాముడు, హనుమంతుడు, రావణుడు పాత్రలను తప్పుగా చూపించారని, అవి హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాయని గౌరవ్ ఆ పిటిషన్లో ఫిర్యాదు చేశారు. వాక్ స్వాతంత్రం ముసుగులో రామాయణాన్ని మార్చలేరని ఆ పిల్ లో పేర్కొన్నారు. హిందూ విశ్వాసం ప్రకారం.. రాముడు ప్రశాంతంగా, ఉదారంగా ఉండే వ్యక్తి అని, కానీ ఈ టీజర్లో మాత్రం రాముడ్ని కోపంగా, ఇతరుల్ని చంపే భావనల్ని కలిగి ఉన్న వ్యక్తిగా చూపించారని ఆరోపించారు.
రావణుడి పాత్ర మరీ ఘోరంగా ఉందని, బాయ్-కట్, క్రూకట్ హెయిర్‌స్టైల్‌తో చెవులపై బ్లేడ్ గుర్తులున్నాయని మండిపడ్డారు. శివుడి పరమభక్తుడైన రావణుడు. మనోహరమైన దుస్తులు ధరించి, మీసకట్టుతో ఎల్లప్పుడూ బంగారు కిరీటం ధరిస్తాడని గౌరవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రావణుడు తన పుష్పక్ యాన్లో సవారీ చేస్తాడని, చాలా దేశాల్లో రావణుడ్ని పూజిస్తారని గుర్తు చేశారు. అటువంటి రావణుణ్ణి భారతదేశంపై దండెత్తిన మొఘల్ పూర్వీకుడిగా చూపించారని గౌరవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు…హీరో ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ కు నోటీసులు జారీ చేసింది. మరి, ఈ నోటీసులపై ప్రభాస్, చిత్ర యూనిట్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.