జగన్ ఎన్ని అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించినా ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన మహా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న తెలిసిందే. అయితే, ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రాజధానులు, విశాఖ పాలనా రాజధానిగా మద్దతుగా బైక్ ర్యాలీలు, సభలు, సమావేశాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 15న మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర గర్జన పేరుతో రాజకీయతర జేఏసీ ర్యాలీ చేపట్టనుంది.
అయితే, పరోక్షంగా వైసీపీ నేతల ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ క్రమంలోనే ఈ గర్జన దేనికి అంటూ జగన్ ను ఉద్దేశించి పవన్ పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసి 22 వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నందుకు ఈ గర్జన చేస్తున్నారా అని పవన్ ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు కలిసి రాష్ట్రాన్ని అప్పుల బాటలో నడిపిస్తున్నందుకు ఈ గర్జనా అని పవన్ నిలదీశారు.
వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు పేట్రేగిపోతున్నందుకు ఈ గర్జన చేపడుతున్నారా అని ప్రశ్నించారు. విపక్ష పార్టీల నేతలపై పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెడుతున్నందుకు ఈ గర్జన చేస్తున్నారా అని పవన్ దుయ్యబట్టారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకా లేదంటే ఐఏఎస్, ఐపీఎస్ లను కోర్టుల చుట్టూ తిప్పుతున్నందుకా అని పవన్ నిలదీశారు.
ఇక, ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నందుకు లేదంటే గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న గురువులు మరుగుదొడ్ల ఫోటోలు తీస్తూ, మద్యం షాపుల దగ్గర డ్యూటీలు చేస్తున్నందుకా అని ప్రశ్నించారు. ఇక, అందమైన పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన అరకు నేడు గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చినందుకా? లేదంటే భారీ మొత్తంలో గంజాయి పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో ఏపీని నెంబర్ వన్ గా నిలిపినందుకా అని పవన్ ప్రశ్నించారు.