దక్షిణాది చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్-1 చిత్రం తమిళనాట ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తన డ్రీమ్ ప్రాజెక్టు అని మణిరత్నం చెప్పిన పీఎస్-1…టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రాజరాజ చోళుడి స్ఫూర్తితో రాసిన కల్పిత కథ పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
రాజరాజ చోళన్ హిందూ కాదని, మన గుర్తింపును లాక్కునేందుకు బీజేపీ వారు ప్రయత్నిస్తున్నారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. తిరువల్లార్ కు కూడా కాషాయ రంగు పులమడానికి బిజెపి నేతలు ప్రయత్నించారని, దీన్ని ఎప్పటికీ అనుమతించకూడదని వెట్రిమారన్ వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలను తాజాగా విశ్వనటుడు కమల హాసన్ సమర్థించడం హాట్ టాపిక్ గా మారింది.
రాజ రాజ చోళుని కాలంలో హిందూ మతం లేదని, వైష్ణవం, శైవం, సమానం మాత్రమే ఉన్నాయని కమల్ అన్నారు. వీటిని సమిష్టిగా ఎలా సూచించాలో తెలియక బ్రిటీషు వాళ్లు హిందూ అనే పదాన్ని ఉపయోగించారని చెప్పుకొచ్చారు. తుత్తుకుడిని టుటికోరిన్గా మార్చిన విధంగానే హిందూ అనే పదాన్ని వాడారని కమల్ చెప్పారు. ఈ క్రమంలోనే వెట్రిమారన్, కమల హాసన్ ల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
రాజ రాజ చోళుడు నిజంగా హిందూ రాజు అని బీజేపీ నేత హెచ్ రాజా అన్నారు. తనకు వెట్రిమారన్లాగా చరిత్రపై పెద్దగా అవగాహన లేదని, కానీ రాజ రాజ చోళుడు నిర్మించిన రెండు చర్చిలు, మసీదులను చూపించమనండి అంటూ సవాల్ విసిరారు. రాజ రాజ చోళుడు తనను తాను శివపాద శేఖరన్ అనేవారని, అలాంటప్పుడు ఆయన హిందువు కాదా? అని ఆయన ప్రశ్నించారు.