దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడాది హైదరాబాద్ లో అలయ్ బలయ్ కార్యక్రమం జరగడం ఆనవాయితీ. మాజీ కేంద్ర మంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన అలయ్ బలయ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లిన దత్తన్న…ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు.
దత్తన్న ఆహ్వానం మేరకు అలయ్ బలయ్ కార్యక్రమానికి చిరంజీవి హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, పలు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, గరికపాటి కూడా హాజరరయ్యారు. బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమం ధూంధాంగా జరిగింది. ప్రతి ఏడాది దసరా మరుసటి రోజు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తన్న నిర్వహిస్తుండగా..తండ్రి వారసత్వాన్ని ఈ ఏడాది కుమార్తె విజయలక్ష్మి కొనసాగించారు.
అలయ్ బలయ్ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి సాంస్కృతిక నృత్యానికి పోతురాజులతో కలిసి స్టెప్పులేశారు. అంతేకాదు, అలయ్ బలయ్ అంటూ స్వయంగా చిరంజీవి డోలు, డప్పు కొట్టడం విశేషం. గాడ్ ఫాదర్ హిట్ అయిన మూడ్ లో ఉన్న చిరు స్వయంగా ఈ వేడుకలకు రావడం…అక్కడ డప్పు కొట్టి, చిందేయడంతో మెగా ఫ్యాన్స్ ఈ రోజు కూడా దసరా పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చిరు డప్పుకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.