ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రెడ్లకు తిరుగులేని పవర్ ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున విపక్షాలు చేస్తున్న వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలతో అధికార పార్టీ ఇరుకున పడినట్లుగా చెప్పాలి. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా నారాయణ స్వామి చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఉగ్రాణం పల్లెలో పర్యటించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం వద్దకు వచ్చిన న్యాయవాది కమ్ రిటైర్డు ఎంఈవో మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ విద్యుత్ సబ్ స్టేషన్ లో సమస్యలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. సబ్ స్టేషన్ లో సిబ్బంది కొరత ఉందని.. సమస్యలు పరిష్కారం కాకపోతే మన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. దీనికి ఉప ముఖ్యమంత్రి అనూహ్యంగా రియాక్టు అయ్యారు. ఆయన నోటి నుంచి ఊహించని మాటలు వచ్చాయి. ‘మీరట్లా మాట్లాడకండి. రెడ్లు అందరూ ఇలానే మాట్లాడతారా?’ అంటూ మండిపడటంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న న్యాయవాది మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న ఎస్ ఐ అనిల్ కలుగజేసుకొని.. ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ రెడ్డిని పక్కకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎస్ఐకు.. న్యాయవాదికి మధ్య వాగ్వాదం జరిగింది. తనను అనవసరంగా దూషిస్తారేంటంటూ మండిపడిన ఆయన.. ఎస్ఐ మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే.. కంప్లైంట్ ను తీసుకునేందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో సీరియస్ అయిన ఆయన.. తనను అకారణంగా దూషించారని.. తానీ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పిన ఆయన వైనం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ సమస్యల్ని ఉప ముఖ్యమంత్రి వరకు తీసుకెళితే.. సంబంధం లేని వ్యాఖ్యలు చేసిన తీరును తప్పు పడుతున్నారు. మరి.. తాను చేసిన వ్యాఖ్యలకు నారాయణ స్వామి సమాధానం ఏమిటన్నది బయటకు రాలేదు.