ఎక్కడైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారంటే.. జనం ఎదురు చూస్తారు. ఆయనను చూడాలని.. ఆయనతో మాట్లాడాలని (కుదిరితే) అనుకుంటారు. కానీ, ఏపీలో అంతా రివర్స్ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్ పేరు చెప్పగానే.. జనం పారిపోతున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సభలో సీఎం పాల్గొన్నారు. అయితే.. జనం ఎక్కడ పారిపోతారో అనుకున్న అధికారులు.. అష్టదిగ్భంధనం చేశారు. అయినా.. కొందరు వెళ్లిపోయారు. ఇక, తాజాగా విజయవాడలో జరిగిన ఘటన మరింత ఆశ్చర్యంగా ఉంది.
బెజవాడ దుర్గ గుడిలో దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. అత్యంత వైభవం సాగుతున్న ఈ దసరా ఉత్సవాల్లో.. అమ్మవారి జన్మనక్షత్రమైన.. మూలా రోజు(ఆదివారం) సరస్వతీ దేవి అలంకారంలో జగన్మాత దర్శనమిచ్చింది.ఈ రోజుకుఎంతో విశిష్టత ఉందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో మూలా నక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు సహజంగానే భక్తులు పోటెత్తుతారు. ఇక, ఆదివారం కూడా కావడంతో.. ఎక్కడెక్కడి నుంచో భక్తులు విజయవాడకు చేరుకున్నారు. దీంతో భారీ ఎత్తున అధికారులు ఏర్పాట్లు చేశారు.
దాదాపు 2 లక్షల మంది వస్తారని కలెక్టర్ అంచనా వేసుకున్నారు.కానీ, ఉదయం 10 గంటలకే ఈ సంఖ్య 3 లక్షలకు చేరింది. దీంతో అప్పటికప్పుడు.. విజయవాడ బస్టాండు వరకు క్యూలైన్లు పెంచారు. అంటే.. దాదాపు 5 కిలో మీటర్ల మేర క్యూలైన్లు ఏర్పాటు చేశారు అవన్నీ నిండిపోయాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు.. క్యూలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలోనే 2.30 అయింది. ఆ వెంటనే క్యూలైన్లు ఆగిపోయాయి. దీనిపై భక్తులు అధికారులను నిలదీశారు. ఏం జరిగిందని ప్రశ్నించారు. “సీఎం సర్ వస్తున్నారు. అందుకే ఆపాం. వెయిట్ చేయండి!“ అధికారు మైకుల్లో ప్రచారం చేశారు.
అంతే.. అరగంటకు అన్ని క్యూలైన్లు ఖాళీ! వీరేమీ.. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వెళ్లలేదు. క్యూలైన్లు ఖాళీ చేసి.. తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పటి వరకు ఇసకేస్తే.. రాలని.. క్యూలైన్లు బోసిపోయాయి. దీంతో అధికారులు అవాక్కయ్యారు. అంటే.. సీఎం వస్తున్నారని తెలిసి.. భక్తులు పరుగో పరుగన్నమాట!! ఇదీ.. సంగతి. ఇదీ.. సీఎం జగన్కు ఉన్న ప్రజాదరణ అని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
పట్టు వస్త్రాల సమర్పణ
ఇక, ముఖ్యమంత్రి జగన్.. బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా.. పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం మూల నక్షత్రం కావడంతో ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. అర్చకులు ఆయన తలకు పరివేష్టం చుట్టారు. అనంతరం సీఎం జగన్ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం.. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎం జగన్కు.. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.