టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లి సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చిన ఘటన సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకుగాను సైబర్ క్రైమ్ విభాగంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం, ఆ సమయంలో ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను విజయ్ ఎక్కడ అంటూ ప్రశ్నించడం వివాదాస్పదమైంది.
ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. విజయ్ ఇంట్లోకి పోలీసులు దోపిడీదొంగల్లా చొరబడడాన్ని ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. విజయ్ ఇంట్లో చిన్నపిల్లలను, పనివాళ్లను భయభ్రాంతులకు గురిచేసేలా వారు వ్యవహరించిన తీరు దారుణమని, ఇంత నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడని చంద్రబాబు నిప్పులు చెరిగారు. డ్రైవర్ పై సీఐడీ పోలీసులు దాడి చేయడం ఎందుకని, కేసులు, విచారణల పేరుతో ప్రతిపక్ష నేతలపైకి పోలీసులను రౌడీల్లా ఉసిగొల్పుతున్నాడని ఫైర్ అయ్యారు.
ఈ వ్యవహారంపై అయ్యన్నపాత్రుడు కూడా మండిపడ్డారు. విజయ్ ఇంట్లో పోలీసులు భయోత్పాతం సృష్టించారని అయ్యన్న ఫైర్ అయ్యారు.జగన్ పై జనం తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. పోలీసులను డ్రైవర్ అడ్డుకున్నాడని, దాంతో అతడిపై వారు దాడి చేశారని అయ్యన్న ఆరోపించారు. ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారని, విజయ్ ఆచూకీ చెప్పాలని పిల్లలను బెదిరించారని మండిపడ్డారు. ఏ కేసో చెప్పకుండా, ముందస్తు నోటీసులివ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారని అయ్యన్న ప్రశ్నించారు. ఇవి కేవలం కక్షసాధింపు రాజకీయాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయ్ వాళ్ల బాబుకు రెండేళ్లు, పాపకు నాలుగేళ్లు అని, వాళ్లిద్దిరినీ పిలిపించి వాళ్ల ఫొటోలు తీసి, మీ నాన్న ఎక్కడున్నాడో చెబుతారా, చెప్పరా? అంటూ బెదిరించారని అయ్యన్న ఫైర్ అయ్యారు. ఇలా చేసిన ఈ ముఖ్యమంత్రి ఎంత దౌర్భాగ్యుడో అర్థమవుతోందని, ప్రతాపం ఏదైనా ఉంటే మా మీద చూపించాలని, పిల్లల మీద కాదని అన్నారు. సీఐడీ బాస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని, కనీసం ఆయనకైనా ఆలోచన రాలేదా? బుద్ది ఉండక్కర్లేదా? ముఖ్యమంత్రి ఏది చెబితే అది చేసేయడమేనా? అని నిప్పులు చెరిగారు.
నర్సీపట్నంలోని తన నివాసంలోకి వచ్చేందుకు కూడా సీఐడీ పోలీసులు పట్టణానికి వచ్చారని అయ్యన్న వెల్లడించారు. ప్రజలు రెచ్చిపోతే పోలీసులే కాదు, సీఐడీనే కాదు, ఈ ముఖ్యమంత్రిని కూడా లెక్కచేయరు అని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.